దేశీయ అవసరాలకు సరిపడా ధాన్యం నిల్వలు

దేశీయ అవసరాలకు సరిపడా తగినంత ఆహారధాన్యాలు నిల్వ ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజల ఆహారపు అవసరాలకు తగ్గట్టుగా బియ్యం , గోధుమల నిల్వలు ఉన్నట్టు తెలిపారు.  దసరా ,దీపావళి పండగల సీజన్ అయినప్పటికీ చక్కెర వంట నూనెలతోపాటుగా ఇతర నిత్యావసర సరుకుల ధరలు స్థిరంగా ఉంటాయన్న ధీమాను వెలిబుచ్చారు.

గోధుమలు , బియ్యం ,చక్కెర ,వంటనూనెలు వంటి ముఖ్యమైన ఆహార పదార్ధాల దేశీయ సరఫరాలు ధరల పరిస్థితులను వివరించారు.  దేశంలో ధరల స్థిరత్వానికి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగిన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ ఏడాది మే 22 నుండి గోధుమల ఎగుమతిపైన నిషేధం అమలు చేయటం, పారాబాయిల్డ్ బియ్యం పై వచ్చే ఏడాది మార్చి వరకూ 20 శాతం ఎగుమతి సుంకం పొడిగింపు, పప్పుధాన్యాల నిల్వలపైన పరిమితులు విధించటం, నియంత్రిత కేటగిరి కింద చక్కెర ఎగుమతుల పొడిగింపు వంటి అనేక ఆంక్షలు ధరల పెరుగుదనలను నిరోధించడానికి దోహదపడతాయని తెలిపారు. 

దేశంలో వినియోగానికి తగిన చక్కెర నిల్వలు ఉన్నట్టు వెల్లడించారు. వంట నూనెల విషయంలో వేరుశనగ మినహా మిగిలిన ఉత్పత్తుల రిటైల్ ధరలు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. గడిచిన మూడు నాలుగు నెలల్లో బియ్యం ద్రబ్యోల్బనం 11నుంచి 12శాతం స్థాయిలో ఉన్నట్టు వెల్లడించారు. మార్కెట్‌లోకి కొత్తపంటల ఉత్పత్తులు వస్తున్న నేపధ్యంలో ధరలు మునుముందు మరింతగా తగ్గుతాన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గోధుమల రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాదిలో దాదాపు 3.6శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా పేర్కొన్నారు.