సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రద కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఉద్యోగులకు ఈఎస్ఐ చెల్లింపుల్లో అవకతవకల కేసులో తనకు విధించిన జైలు శిక్షను రద్దు చేయాలంటూ కోర్టును ఆశ్రయించగా కోర్ట్ ఆమెకు షాక్ ఇచ్చింది. 15 రోజుల్లోగా కోర్టులో లొంగిపోవాలని, అలాగే రూ.20 లక్షలు కూడా డిపాజిట్ చేయాలంటూ శుక్రవారం మద్రాస్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళ్ చెన్నైకి చెందిన రామ్‌కుమార్, రాజ్‌బాబులతో కలిసి జయప్రద అన్నాసాలైలో గతంలో ఓ థియేటర్ నిర్వహించారు. ఆ సమయంలో సిబ్బందికి ఈఎస్ఐ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డారని ఎగ్మూర్ కోర్టులో కేసు దాఖలైంది. ఈ క్రమంలో న్యాయస్థానం జయప్రదతో సహా ముగ్గురికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ ఆగస్టులో తీర్పు వెలువరించింది.
ఈ 6 నెలల జైలు శిక్షను తాత్కాలికంగా నిలిపివేయాలని కోరుతూ జయప్రదతో పాటు మిగిలిన ఇద్దరు ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జిని ఆశ్రయించారు. జైలు శిక్ష నిలిపివేయడం కుదరదని ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి తీర్పు చెప్పారు. ఈ తీర్పును సవాలు చేస్తూ జయప్రద హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు సైతం తోసిపుచ్చింది.
పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి, ఈఎస్‌ఐ బాకీ కింద రూ.37.28 లక్షలు చెల్లించడం కుదురుతుందా? లేదా? అనే విషయంలో స్పష్టత ఇవ్వాలని జయప్రదను కోరారు. రూ.20 లక్షలు చెల్లిస్తానని ఆమె చెప్పగా ఈఎస్ఐ తరపు న్యాయవాది వ్యతిరేకించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం శుక్రవారం జయప్రద పిటిషన్ కొట్టేస్తూ తీర్పు వెలువరించింది.
తీర్పు వెలువడిన రోజున ట్రయల్ కోర్టుకు హాజరుకావాలని, అలాగే శిక్ష ఖరారు కాగానే అప్పీల్ కోర్టులో లొంగిపోవాలని చెప్పిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.జయచంద్రన్ ఈ రెండూ చేయని నిందితుల శిక్షను రద్దు చేయాలనే పిటిషన్‌ను అప్పీల్ కోర్టు తిరస్కరించడం సరైనదేనని తెలిపారు. 15 రోజుల్లోగా రూ.20 లక్షలు డిపాజిట్ చేస్తేనే ఈ కేసులో బెయిల్ దరఖాస్తు కానీ, శిక్షను రద్దు చేయాలని కోరుతూ దాఖలుచేసిన దరఖాస్తులను కానీ పరిగణనలోకి తీసుకుంటామని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
More Stories
ఆర్బిఐ కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా
కొత్తగా వంద ఎయిర్‌బస్ విమానాలకు ఆర్డర్
నోయిడా విమానాశ్రయం రన్‌వేపై తొలి విమానం