160 కిమీ వేగంతో ర్యాపిడ్‌ ఎక్స్‌ రైళ్లు వచ్చేస్తున్నాయ్‌

మరో హైస్పీడ్‌ ప్రాంతీయ రైలును పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ర్యాపిడ్‌ ఎక్స్‌ పేరుతో ఈ ప్రాజెక్టును రూపొందించింది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రాజధాని ప్రాంతంలో దేశ తొలి ప్రాంతీయ హైస్పీడ్‌ రైలును ప్రారంభించనున్నారు. 
 
గంటకు 160కి.మీల వేగంతో దూసుకెళ్లే ఈ రైలులో అనేక అధునాతన వసతులు ఏర్పాటు చేశారు. ఢిల్లి-ఘజియాబాద్‌ రీజనల్‌ ర్యాపిడ్‌ ట్రాన్సిట్‌ సిస్టమ్‌ కారిడార్‌లో సాహిబాబాద్‌-దుహై డిపో మధ్య ఈ రైలు పరుగులుతీయనుంది. అక్టోబర్‌ 21 నుంచి ప్రయాణికులకు సేవలు అందిస్తాయి. ఐదు స్టేషన్ల (సాహిబాబాద్‌, ఘజియాబాద్‌, గుల్దర్‌, దుహై, దుహై డిపో) మీదుగా సర్వీసులందిస్తుంది.
 
వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇప్పుడు అధునాతన రీతిలో సెమీ హైస్పీడ్ రైళ్లుగా నడుస్తున్నాయి.  దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైళ్లకు సంబంధించిన, ప్రాంతీయ వేగవంత ప్రయాణాల వ్యవస్థ (ఆర్‌ఆర్‌టిఎస్) ప్రాజెక్టుకు 2019 మార్చిలో ప్రధాని నరేంద్ర మోదీ  అంకురార్పణ చేశారు. 
ఈ ప్రాజెక్టులో భాగంగా తొలి రైలు నేడు (శుక్రవారం) పట్టాలపై దూసుకువెళ్లనుంది. 

మొత్తం 82 కిలోమీటర్ల ఢిల్లీ -మీరట్ రైలు మార్గంలో ఇప్పటికీ 17 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయింది. మొత్తం రైలు మార్గ నిర్మాణం 2025 జూన్‌కు అందుబాటులోకి వస్తుంది. కాగా ఇప్పుడు ఈ ర్యాపిడ్ రైలు ఢిల్లీ ఘజియాబాద్ మీరట్ ప్రియార్టీ సెక్షన్‌లోని పూర్తయిన 17 కిలోమీటర్ల పరిధిలో దూసుకువెళ్లుతుంది.

ఈ ర్యాపిడ్ రైళ్లు పలు సౌకర్యాలతో ఉంటాయి. మెట్రో రైళ్ల మాదిరిగానే ఉండే ఈ రైళ్లు పలు విధాలుగా ప్రయాణికుల సౌకర్యాలను సంతరించుకుంటాయి. ప్రత్యేకంగా లగేజ్ కేరియర్లు, చిన్నపాటి స్క్రీన్‌లో బోగీలలో నెలకొని ఉంటాయి. వైఫై కనెక్షను, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌ల ఛార్జింగ్ ఏర్పాట్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. 

ప్రతి ర్యాపిడ్ రైలులోనూ ఒక డీలక్స్ క్లాస్ కోచ్ ఉంటుంది. ఇందులో విశాలమైన సీట్ల ఏర్పాట్లు, సౌకర్యవంతమైన కూర్చునే వెసులుబాట్లు, కోట్ హాంగర్స్ కూడా ఉంటాయి. ర్యాపిడ్ రైలు ప్రాజెక్టులో భాగంగా ఇప్పుడు ఆరంభం అయ్యే ఢిల్లీ మీరట్ రైలులో ఐదు స్టేషన్లు ఉంటాయి.