కర్నాటక ఉపముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రముఖ నేత డికె శివకుమార్‌కు గురువారం కర్నాటక హైకోర్టులో చుక్కెదురైంది. లెక్కల్లోకి రాని, ఆదాయానికి మించిన ఆస్తులపై సిబిఐ తనపై దాఖలు చేసిన కేసును కొట్టివేయాలని డికె క్యాష్ పిటిషన్ పెట్టుకున్నారు. దీనిని విచారించిన హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసిన తర్వాత గురువారం వెలువరించింది. క్వాష్ పిటిషన్‌ను తోసిపుచ్చుతున్నట్లు న్యాయమూర్తి కె నటరాజన్ తెలిపారు. సిబిఐ నమోదిత ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలనే పిటిషన్‌లో ఎటువంటి ఔచిత్యత కనబడటం లేదని న్యాయమూర్తి పేర్కొన్నారు.
సిబిఐ సంబంధిత విషయంలో దర్యాప్తు జరిపి తమకు మూడు నెలల వ్యవధిలో నివేదిక అందించాలని ఆదేశించారు. కేసులో విచారణ చాలా వరకు పూర్తయినందున ఈ దశలో తాము జోక్యం చేసుకోవడం సరైనది కాదని జస్టిస్ కె.నటరాజన్ అభిప్రాయపడ్డారు. డీకే శివకుమార్ ఆస్తుల కేసులో సీబీఐ విచారణపై ఉన్న స్టేను కర్ణాటక హైకోర్టు ఎత్తివేసింది.
అక్టోబర్ 2, 2020న సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను డీకే శివకుమార్ సవాలు చేశారు. ఫిబ్రవరి 2023లో విచారణ చేసిన కోర్టు తీర్పుపై స్టే విధించింది. 2013-2018 మధ్య కాలంలో డీకే, అతని కుటుంబ సభ్యులు రూ.74 కోట్ల అక్రమ ఆస్తులు సంపాదించారని సీబీఐ అధికారులు ఆరోపిస్తున్నారు.
కాగా, తనకు న్యాయస్థానంపై, చట్టాలపై అపార విశ్వాసం ఉందని చెబుతూ అన్నింటిని ఎదుర్కొంటానని శివకుమార్ తెలిపారు. న్యాయపరంగా తాను సిబిఐ కేసును ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. జెడిఎస్ నేత కుమారస్వామి తనను తీహార్ జైలుకు పంపిస్తారని చెపుతున్నారని , ఇటువంటి వాటికి బెదిరేది లేదని పిసిసి నేత కూడా అయిన డికె తెలిపారు.
More Stories
ఆర్బిఐ కొత్త గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా
కొత్తగా వంద ఎయిర్‌బస్ విమానాలకు ఆర్డర్
నోయిడా విమానాశ్రయం రన్‌వేపై తొలి విమానం