6 పంటల మద్దతు ధర పెంపు

రబీ సీజన్‌కు సంబంధించి గోధుమ, బార్లీ సహా మొత్తం 6 ప్రముఖ పంటల కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచింది.  ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
 
2024- 25 రిబీ సీజన్‌కు గానూ గోధుమ, బార్లీ, సన్‌ఫ్లవర్, శనగ, ఆవాలు, కంది పంటలకు కనీస మద్ధతు ధర పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో అత్యధికంగా గోధుమ పంటలకు క్వింటాలుకు రూ. 150 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయం ప్రకారం గోధుమల కనీస మద్దతు ధరను రూ. 150 పెంచడంతో క్వింటా గోధుమల ధర రూ. 2, 275కు చేరింది. 
 
2014లో ప్రధాన మంత్రి నేతృత్వంలోని ఎన్‌డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ స్థాయిలో గోధుమలకు మద్దతు ధర పెంచడం ఇదే తొలిసారి కావడం విశేషం. సీఏసీపీ సిఫారసుల మేరకు ఆరు రబీ పంటల ఎంఎస్‌పీని పెంచామని, గోధుమల ఎంఎస్‌పీని క్వింటాల్‌కు రూ.150 పెంచామని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 
 
రబీ పంటల్లో గోధుమ అత్యంత ప్రధానమైనది. ప్రభుత్వం తన ఏజెన్సీల ద్వారా రైతుల నుంచి కనీస మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేస్తుంది.
 
6 పంటల కనీస మద్దతు ధరలు

  1. గోధుమల కనీస మద్దతు ధర రూ.150 పెంపుతో క్వింటా గోధుమల ధర రూ. 2,275కు పెరిగింది.
  2. బార్లీ పంటపై రూ. 115 పెంపుతో క్వింటాకు రూ. 1850కి చేరింది.
  3. శెనగ పంటపై రూ. 105 పెంపుతో క్వింటాలు శెనగ ధర రూ. 5,440కి చేరింది.
  4. కంది పంటపై రూ. 425 పెంచడంతో క్వింటాలుకు ధర రూ. 6,425కు పెరిగింది.
  5. ఆవాలుపై రూ. 200 పెంపుతో క్వింటాలు ధర రూ. 5, 650కి చేరింది.
  6. సన్‌ఫ్లవర్ పంటపై రూ. 150 పెంచడంతో క్వింటాలు ధర రూ. 5,800కు పెరిగింది.