ఉద్యోగ కల్పన, ఉద్యోగుల జీతాల విషయంలో భారతీయ పరిశ్రమలను ప్రశ్నిస్తూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాపార సౌలభ్యం, పన్ను కోతల వంటి ప్రభుత్వ చర్యల ప్రయోజనాలను జీతాలు పెంచడం ద్వారా తమ ఉద్యోగులకు అందించడం లేదని ప్రశ్నించారు. భారతీయ వినియోగదారుల కోసం నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేయనందుకు ఆయన పరిశ్రమను విమర్శించారు. తయారీదారులలోని ఈ వైఖరి పట్ల తాను “సిగ్గుపడుతున్నానని” పేర్కొన్నారు.
ఈ ఏడాది శత వార్షికోత్సవాలు జరుపుకుంటున్న పారిశ్రామిక సంస్థ ఫిక్కీ వార్షిక సర్వసభ్య సమావేశం, వార్షిక సదస్సును ఉద్దేశించి న్యూఢిల్లీలో ప్రసంగిస్తూ మోదీ ఇలా పేర్కొన్నారు:
“2014లో కార్పొరేట్ పన్ను రేటు 30%గా ఉండేది. మేము దానిని 22%కి తగ్గించాము. ఈ రోజు భారతదేశంలో, రూ. 12 లక్షల వరకు సంపాదనపై పన్ను లేదు. మీరు చప్పట్లు కొట్టరని నాకు తెలుసు. ఈ విషయం నాకు బాగా తెలుసు. ఎందుకంటే మీ ఆకలి ఎంత తీరనిదంటే, మీకు ఎంత ఇచ్చినా అది ఎప్పటికీ సరిపోదు. కానీ మీరు మీ ఉద్యోగుల జీతాలు పెంచారా? మీ సంస్థలలో ఉద్యోగుల సంఖ్యను పెంచారా? లేదు. మీరు, ‘మోదీ జీ, మీరు మీ వంతు పని చేయండి, మేము చూస్తాము’ అని అంటారు. ఇది ఇలాగే కొనసాగుతుంది.”
“140 కోట్ల మంది ప్రజల మార్కెట్ ఒక బలం, అదే సమయంలో ఒక సవాలు కూడా. ఎందుకంటే మీరు ఏది తయారు చేసినా అది ఖచ్చితంగా అమ్ముడవుతుందని మీకు తెలుసు. ఎవరో ఒకరు దాన్ని కొంటారు. పెద్ద నగరంలో ఎవరూ కొనకపోయినా, చిన్న నగరంలో ఎవరో ఒకరు కొంటారు. చిన్న నగరంలో ఎవరూ కొనకపోయినా, పెద్ద గ్రామంలో ఎవరో ఒకరు కొంటారు. కానీ ఇది ఇలాగే కొనసాగకూడదు. మీరు మీ నాణ్యతను మెరుగుపరచుకోవాలి. నాకు సిగ్గుగా ఉంది. మన ప్రజలకు మంచి నాణ్యమైన ఉత్పత్తులను పొందే హక్కు లేదా? ఈ ఆలోచనా విధానం మారాలి. నా దేశ ప్రజలు నాణ్యతకు అర్హులు,” అని ఆయన స్పష్టం చేశారు.
“వనరులను ఆయుధాలుగా మార్చే” ఈ యుగంలో, ఫార్మాస్యూటికల్స్, ఉక్కు, అల్యూమినియం వంటి కీలక రంగాలలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి వ్యాపార సంస్థలు దేశీయ తయారీ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవాలని; వ్యవసాయం, ఆహార శుద్ధి రంగాలలో పెట్టుబడులను పెంచాలని; ఇంజనీరింగ్ వస్తువులలోని అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన కోరారు.
నాణ్యతను, విస్తరణను అభివృద్ధి చేసుకోవడంలో చిన్న కంపెనీలకు పెద్ద కంపెనీలు సహాయపడాలని ఆయన కోరారు. “మనం కలిసికట్టుగా, అభివృద్ధి చెందుతున్న దేశాలకు, గ్లోబల్ సౌత్‌కు అవసరమైన యంత్రాలను తయారు చేయగలం. మన పరిశ్రమ ప్యాకేజింగ్ పరికరాలు, నీటిపారుదల వ్యవస్థలు, ఫ్యాక్టరీ సంబంధిత యంత్రాల మార్కెట్లను అన్వేషించగలదు. ఏ దేశమైనా తన రైతులను, చిన్న పారిశ్రామికవేత్తలను, పరిశ్రమలను, సంపద సృష్టికర్తలను, పన్ను చెల్లింపుదారులను గౌరవించినప్పుడే పురోగమిస్తుంది,” అని ఆయన తెలిపారు.

More Stories
తమిళనాడు పెట్టుబడుల వివరాలు ఆంధ్రాకు లీక్?
అయోధ్యలో పోటీకి సిద్ధమా? అఖిలేష్ కు యోగి సవాల్
డ్రోన్ల దాడులతో సగంకు పడిపోయిన రష్యా చమురు శుద్ధి