డ్రోన్ల దాడులతో సగంకు పడిపోయిన రష్యా చమురు శుద్ధి 

 
* 15  చమురు శుద్ధి కేంద్రాలు మూసివేత 
రష్యాపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు తీవ్రతరం కావడంతో ఆ దేశ చమురు శుద్ధి రంగం భారీగా ప్రభావితమవుతోంది. అక్టోబర్ చివరి నుంచి ఉక్రెయిన్ జరుపుతున్న డ్రోన్ దాడుల కారణంగా రష్యా చమురు శుద్ధి కేంద్రాల్లో ముడి చమురు ప్రాసెసింగ్ పరిమాణం దాదాపు 45 శాతం తగ్గినట్లు పరిశ్రమ వర్గాల అంచనాలు వెల్లడించాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇంధన కొరతను ఎదుర్కొంటున్న రష్యాకు ఈ పరిణామం మరింత ఇబ్బందికరంగా మారింది. 

రష్యాలోని 35 ప్రధాన చమురు శుద్ధి కేంద్రాల్లో 15 కేంద్రాల కార్యకలాపాలు ఉక్రెయిన్ డ్రోన్ దాడుల వల్ల నిలిచిపోయినట్లు లేదా తీవ్రంగా ప్రభావితమైనట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. గత వారం మధ్యలో ఈ సంఖ్య తొమ్మిదిగా ఉండగా, తాజాగా 15కు చేరింది. అక్టోబర్ చివరి నాటికి రోజుకు 7 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ఉన్న ముడి చమురు ప్రాసెసింగ్ ప్రస్తుతం రోజుకు సుమారు 4 లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయింది. అంటే రోజుకు దాదాపు 30 లక్షల బ్యారెళ్ల స్థాయికి చేరింది.

ఈ వారం ఉక్రెయిన్ వ్యూహాత్మకంగా కీలకమైన ఓ వంతెనను లక్ష్యంగా చేసుకోవడంతోపాటు పలు చమురు శుద్ధి కేంద్రాలపై దాడులు చేసింది. 2022లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యాపై జరిగిన అతిపెద్ద రాత్రిపూట డ్రోన్ దాడిగా దీనిని రష్యా రక్షణ శాఖ గణాంకాలు పేర్కొన్నాయి. గత 20 రోజులుగా దాదాపు ప్రతిరోజూ డ్రోన్ దాడులు జరుగుతున్నాయి. రియాజాన్, యారోస్లావల్, కిరిషి, వోల్గా ప్రాంతాల్లోని ప్రధాన చమురు శుద్ధి కేంద్రాలు ఈ దాడులతో ప్రభావితమైనట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి.

దాడులకు గురైన రష్యా చమురు శుద్ధి కేంద్రాల మొత్తం నామమాత్రపు సామర్థ్యం రోజుకు సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నులుగా అంచనా. ఇది దేశ మొత్తం ప్రాథమిక చమురు శుద్ధి సామర్థ్యంలో దాదాపు 54 శాతానికి సమానం. రష్యా మొత్తం శుద్ధి సామర్థ్యం రోజుకు సుమారు 9.30 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది.  కార్యకలాపాలు క్రమంగా తగ్గుతూ వచ్చిన నేపథ్యంలో నవంబర్‌లో సగటు ముడి చమురు ప్రాసెసింగ్ రోజుకు 5 లక్షల మెట్రిక్ టన్నులకు పైగానే ఉన్నట్లు వర్గాలు పేర్కొన్నాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలలతో పోలిస్తే ఇది 5 నుంచి 10 శాతం తక్కువ.

మరోవైపు నౌకాశ్రయాలపై దాడులతో చమురు ఎగుమతుల సామర్థ్యం కూడా పరిమితమైంది. అంతేకాకుండా అమెరికాకు డీజిల్ ఎగుమతి చేసేందుకు కుదిరిన ఒప్పందాన్ని అమలు చేయడంలోనూ రష్యాకు ఇబ్బందులు ఎదురుకావచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అక్టోబర్ 11న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరుదేశాల మధ్య ఇంధన రంగానికి సంబంధించి కాల్పుల విరమణను ప్రకటించారు. అయితే మాస్కో, కీవ్ ప్రభుత్వాలు దీనికి అంగీకరించినట్లు ధ్రువీకరించలేదు. 

About The Author