హెచ్1 బి వీసా ప్రోగ్రామ్‌లో కీలక మార్పులు

హెచ్1బి వీసా ప్రోగ్రామ్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు అమెరికా కీలక మార్పులకు సిద్ధమయింది. వీసా వ్యవస్థలో పారదర్శకత,లబ్ధిదారులకు న్యాయం చేయడం తదితర లక్షాలతో బైడెన్ ప్రభుత్వం ఈ కీలక మార్పులను ప్రతిపాదించింది. వీసా అర్హత నిబంధనలు, ప్రయోజనాల పెంపు, పలు సడలింపులతో కూడిన సమగ్ర మార్పులకు శ్రీకారం చుట్టింది.

హెచ్1బి వీసా వ్యవస్థ దుర్వినియోగానికి అడ్డుకట్టవేసేందుకు బైడెన్ ప్రభుత్వం సింగ్యులర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. దీనివల్ల దరఖాస్తుదారుడి తరఫున ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే దానితో సంబంధం లేకుండా అతని వివరాలను ఒకేసారి నమోదు చేసుకుంటారు.  దీనివల్ల బహుళ దరఖాస్తుల ద్వారా వీసా లాటరీని తప్పుదోవ పట్టించేందకు అవకాశం ఉండదని అమెరికా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఓ లబ్ధిదారుడి తరఫున పలు దరఖాస్తులు దాఖలు చేసే అవకాశం లేకుండా సంస్థలను ప్రభుత్వం కట్టడి చేయనుంది.

ఈ క్రమంలో ఆయా సంస్థల కార్యాలయాలను అమెరికా పౌరసత్వ, వలసల శాఖ అధికారులు తనిఖీ చేసేందుకు అదనపు అధికారాలను కట్టబెట్టనున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారి దరఖాస్తులను తిరస్కరించడం, జరిమానాలు విధించడం లేదా వారిపై చర్యలను రివోక్ చేయడం వంటి వాటికి అవకాశం కల్పించే కఠిన నిబంధనలను సిద్ధం చేశారు. 

అభ్యర్థుల విద్యార్హత, వారు చేయబోయే ఉద్యోగానికి మధ్య సంబంధంపై మరింత స్పష్టత చేకూర్చే విధంగా బైడెన్ సర్కార్‌నిబంధనలను రూపొందించింది. దీనివల్ల భవిష్యత్తులో అప్లికేషన్ ప్రాసెస్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకొంటోంది.  స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ పరిశోధనాసంస్థలు, ఇతర లబ్ధిదారులకు ఇచ్చే మినహాయింపులు మరింత విస్తృతపరిచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎఫ్1బి వీసాదారులకు ఇకపై మరింత సులభంగా హెచ్1బి వీసాకు దరఖాస్తు చేసుకునేలా నిబంధనల్లో మార్పులను ప్రతిపాదించింది.

ఇక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా హెచ్1బి వీసా అర్హతల్లో కొత్త నిబంధనలను జోడించేందుకు హోంల్యాండ్ సెక్యూరిటీ సిద్ధమవుతోంది. కాగా తాజా మార్పులపై ఎన్‌ఆర్‌ఐ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతులను అమెరికాకు తీసుకువచ్చేలా నూతన ప్రతిపాదనలు ఉన్నాయని పలువురు ఎన్‌ఆర్‌ఐలు అభిప్రాయపడ్డారు.