దౌత్య సిబ్బంది ఉపసంహరణపై కెనడా ఆరోపణలు అసందర్భం

భారత్ నుండి 41 మంది కెనడా దౌత్య సిబ్బంది ఉపసంహరణకు సంబంధించి ఆ దేశ విదేశాంగ మంత్రి చేసిన ఆరోపణలు అసందర్భం అంటూ భారత్ కొట్టిపారేసింది. ఈ సందర్భంగా భారత్ అంతర్జాతీయ చట్టాలను ఉల్లంగించినట్లు కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ టొరంటోలో చేసిన ప్రకటనను భారత్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఖండించారు.

దౌత్యవేత్తల విషయంలో కెనడా ఆరోపణలు అర్థరహితంగా, దురుద్ధేశపూరితంగా ఉన్నాయని భారతదేశం తేల్చి చెప్పింది. ఇక్కడున్న కెనడా దౌత్యవేత్తల సంఖ్యను క్రమబద్ధీకరించేందుకు, కేవలం 21 మంది వరకూ సిబ్బందిని పరిమితం చేసుకోవాలని తెలిపినట్లు తెలిపింది. అయితే దీనిని ఇప్పుడు కెనడా వక్రీకరిస్తోందని, అంతర్జాతీయ సూత్రాలను ఉల్లంఘిస్తున్నట్లు దుష్ప్రచారానికి దిగుతోందని భారతదేశం నిందించింది. 

 పైగా, భారత అంతర్గత వ్యవహారాలలో కెనడా దౌత్యసిబ్బంది అతిగా జోక్యం చేసుకుంటున్నదనే విషయం తమకు తెలిసిందని భారత్ తీవ్రమైన ఆరోపణ చేసింది. అయినా ఏ దేశం అయినా దౌత్యవేత్తల సంఖ్య విషయంలో సమస్థాయిని పాటించాలనేదే భారతదేశ అభిప్రాయం అని తెలిపింది.  ‘భారత్‌లో దౌత్య సిబ్బంది సంఖ్యపై కెనడా ప్రభుత్వం చేసిన వ్యాఖ్యలను చూశాం. భారత్‌లో కెనడా దౌత్యవేత్తల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. అంతేగాక మన అంతర్గత వ్యవహారాల్లో వారు తరచూ జోక్యం చేసుకుంటున్నారు’ అంటూ భారత్ ధీటుగా సమాధానం ఇచ్చింది.

`న్యూఢిల్లీ, ఒట్టావా దౌత్య సంబంధాల్లో పరస్పర సమానత్వం ఉండాలని మేం కోరుకుంటున్నాం. దీని గురించి గత నెల రోజులుగా కెనడాతో చర్చలు జరిపాం. వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్‌ 11.1 నిబంధనలకు అనుగుణంగానే దౌత్య సిబ్బంది సంఖ్యలో సమానత్వాన్ని అమలు చేసేందుకు మేం చర్యలు తీసుకున్నాం. సమానత్వ అమలును నిబంధనల ఉల్లంఘనగా చిత్రీకరించే ప్రయత్నాలను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’ అని తేల్చి చెపింది.

ఇప్పుడు కెనడా విదేశాంగ మంత్రి చేసిన ప్రకటన అసందర్భంగా ఉందని పేర్కొంటూ చాలా నెలలుగా దౌత్యసిబ్బంది సంఖ్య తగ్గింపుపై మాట్లాడుతూనే ఉన్నామని, గత నెలలోనే సరైన విధంగా దీనిని అమలుచేసే కార్యాచరణ గురించి చర్చించినట్లు భారత్ గుర్తు చేసింది. 

దౌత్యసిబ్బంది సంఖ్య సమతూకత విషయంలో భారతదేశం తీసుకుంటున్న చర్యలన్ని కూడా వియన్నా కన్వెన్షన్‌లోని నిబంధనలకు అనుగుణంగానే ఉన్నాయని, దీనిని కెనడా గుర్తుంచుకుంటే మంచిదని భారతదేశం హితవు చెప్పింది.