వైసిపి ఎమ్యెల్యే మేకపాటి సంస్థపై ఈడీ కేసు

నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్ హెచ్ ఎ ఐ)ను మోసం చేశారనే ఆరోపణలపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ్యుడు మేకపాటి విక్రమ్‌ రెడ్డికి చెందిన  కృష్ణ మోహన్ కన్‌స్ట్రక్షన్స్‌ (కెఎంసి)పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు కేసు నమోదు చేశారు.
కేఎంసీతో పాటు పలువురు కాంట్రాక్టర్లపైనా ఈడీ అధికారులు కేసులు పెట్టారు.
కోల్‌తాలోని భారత్ రోడ్ నెట్‌వర్క్ లిమిటెడ్, గురువాయూర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, త్రిసూర్‌లోని జీఐపీఎల్ కార్యాలయాల్లో సోదాలను నిర్వహించారు. 

డాక్యుమెంట్లను పరిశీలించిన అనంతరం ఈ చీటింగ్ కేసు నమోదు చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈ సోదాలు చేపట్టారు. 2006 నుంచి 2016 మధ్యకాలంలో కేరళలోని పాలక్కాడ్‌లో 47వ జాతీయ రహదారి నిర్మాణానికి సంబంధించిన రెండు సెక్షన్ల నిర్మాణ పనుల్లో మేకపాటి విక్రమ్ రెడ్డి అవకతవకలకు పాల్పడ్డారనేది ప్రధాన ఆరోపణ. 
 
దీనివల్ల ఎన్‌హెచ్ఏఐకి సుమారు రూ. 102 కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఈడీ అధికారులు అంచనా వేశారు. ఈ జాతీయ రహదారి నిర్మాణంలో ప్రధాన కాంట్రాక్ట్ కంపెనీ జీఐపీఎల్‌కు కేఎంసీ సబ్-కాంట్రాక్టింగ్ వ్యవహరించిందని తెలుస్తోంది.  కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్ రోడ్డు ప్రాజెక్ట్ పూర్తి ధృవీకరణ పత్రాన్ని మోసపూరితంగా పొందిందని, అక్రమంగా టోల్ మొత్తాన్ని వసూలు చేసిందని ఈడీ అధికారులు నిర్ధారించినట్లు సమాచారం.
బస్ బేల నిర్మాణాన్ని పూర్తి చేయకుండానే, జీఐపీఎల్‌ అడ్వర్టయిజ్‌మెంట్ స్థలం ఇవ్వకుండా అక్రమంగా ఆదాయాన్ని ఆర్జించిందనే ఆరోపణలు ప్రధాన కాంట్రాక్ట్ సంస్థ జీఐపీఎల్‌పై ఉన్నట్లు చెబుతున్నారు.  దీనికి సబ్ కాంట్రాక్టింగ్ వ్యవహరించినందున కేఎంసీపైనా ఈడీ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కేసు నమోదు చేయడానికి ముందు ఈడీ అధికారులు హైదరాబాద్‌లోని కేఎంసీ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.
కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగానే ఈ చీటింగ్ కేసు నమోదు చేశారని అంటున్నారు. దీనిపై త్వరలోనే కంపెనీ యాజమాన్యానికి నోటీసులను జారీ చేస్తారని తెలుస్తోంది.