చంద్రబాబు, లోకేశ్ లపై సీఐడీ కేసు నమోదు

ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై అపోహలు కల్పించేలా టీడీపీ వీడియోలు, ఐవీఆర్ఎస్ కాల్స్ చేస్తుందని వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేయడంతో ఏపీ సిఐడితో విచారణ జరిపించి, చర్యలు తీసుకోమని  ఎన్నికల కమిషన్ ఆదేశించింది. దానితో ఈసీ ఆదేశాలతో సీఐడీ ఆదివారం కేసు నమోదు చేసింది.  ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై  ఐవీఆర్ఎస్ కాల్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిందెవరో తేల్చేలా దర్యాప్తు చేపట్టింది.

ఐవీఆర్ఎస్ కాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై సీఐడీ ద్రుష్టి సారిస్తుంది. దీనిపై పూర్తి విచారణ తర్వాత సీఐడీ ఈసీకి నివేదిక ఇవ్వనుంది.  ఈ కేసులో సీఐడీ అధికారులు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపీసీ U/S 171(F)(G), 188, 505(2), R/w 120(B) సెక్షల కింద సీఐడీ కేసు నమోదు చేశారు.

ఈ కేసులో ఏ1 గా చంద్రబాబు నాయుడు, ఏ2 గా లోకేశ్ పేర్లను చేర్చారు. అలాగే టీడీపీ, టీడీపీ ఎలక్ట్రానిక్ క్యాంపెయిన్, ఐవీఆర్ కాల్స్, వాయిస్ టెక్నీషియన్ పేర్లను కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ఏపీ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్  ప్రధాన ఆస్త్రంగా మారింది. కూటమి పార్టీలు ఈ చట్టంతో మీ భూములను ప్రభుత్వం లాగేసుకుందని ప్రచారం చేస్తున్నాయి. ఈ చట్టంపై టీడీపీ ఐవీఆర్ఎస్ కాల్స్ కూడా చేస్తుంది.

“వైసీపీ అధికారంలోకి వస్తే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్  అమలు చేస్తారు, దీంతో మీ ఆస్తులు జగన్ ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు జిరాక్స్ పత్రాలు మాత్రమే ఇస్తారు. ఇది జగన్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్. జగన్ ఓ ల్యాండ్ గ్రాబర్” అంటూ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ తరఫున ఆ పార్టీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. 

ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  లక్ష్యంగా ఎన్నికల్లో లబ్దిపొందేందుకు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.