స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టిడిపి చంద్రబాబు రిమాండ్ ను ఏసీబీ కోర్టు మరోసారి పొడిగించింది. చంద్రబాబు రిమాండ్ నేటితో ముగియనుండడంతో పోలీసులు ఆయనను వర్చువల్ గా జడ్జి ముందు ప్రవేశపెట్టారు. చంద్రబాబు రిమాండ్‌తో పాటు ఇతర కేసుల వ్యవహారంలో ఉన్నత కోర్టుల్లో విచారణ పెండింగ్‌లో ఉండటంతో నవంబర్ 1వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్లు ఏసీబీ న్యాయమూర్తి ప్రకటించారు. సెప్టెంబర్ 10వ తేదీ నుంచి చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు.
ఈ క్రమంలో జైలులో తన సెక్యూరిటీ విషయంలో పలు అనుమానాలు ఉన్నాయని చంద్రబాబు కోర్టుకు తెలిపారు. తాను జడ్ ప్లస్ సెక్యూరిటీ కలిగిన వ్యక్తినని జడ్జికి వివరించారు. జైల్లో పరిస్థితులపై ఏమైనా అనుమానాలుంటే రాతపూర్వకంగా తెలియచేయాలని జడ్జి సూచించారు. చంద్రబాబు లేఖను తనకు పంపించాలని జైలు అధికారులకు జడ్జి హిమబిందు ఆదేశించారు.
చంద్రబాబు ఆరోగ్యం విషయంలో దాఖలైన పిటిషన్ల నేపథ్యంలో జడ్జి స్పందించారు. చంద్రబాబు ఆరోగ్యంపై అధికారులను ఆరా తీశారు. వైద్యులు రోజువారీ తనిఖీలు నిర్వహిస్తున్నారా లేదో ప్రశ్నించారు. ఆరోగ్య సమస్యల విషయంలో చంద్రబాబుకు ఏమైనా కోర్టు దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తే వాటిని కూడా రాతపూర్వకంగా తెలియ చేయాలని సూచించారు. చంద్రబాబు లేఖను సీల్డ్ కవర్‌లో కోర్టుకు పంపాలని జైలు అధికారులకు ఏసీబీ కోర్టు జడ్జి సూచించారు.
మరోవైపు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‍పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. చంద్రబాబు హెల్త్ కండీషన్‍పై మెమో దాఖలు చేసినట్లు బాబు తరపు న్యాయవాది లూథ్రా కోర్టుకు తెలిపారు. వైద్యుల సిఫార్సు చేసిన అంశాలను కోర్టుకు వివరించారు. చంద్రబాబు ఆరోగ్యం ఇబ్బందిగా మారుతుందని కోర్టుకు తెలిపిన లూథ్రా, చంద్రబాబుకు 2 వారాల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు.
మరోవైపు బాబు తరపు న్యాయవాదుల వాదనల్ని సిఐడి విభేదించింది. చంద్రబాబు మధ్యంతరం బెయిల్ సుప్రీంకోర్టు తిరస్కరించిందని గుర్తు చేశారు. మెయిన్ బెయిల్ పిటిషన్ తీర్పు రిజర్వ్ లో ఉన్నందున మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని సుప్రీంకోర్టు తెలిపిందని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గుర్తు చేశారు. దీంతో స్కిల్ స్కాంలో చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్ ఏపీ హైకోర్టు కొట్టేసింది.
కాగా, బెయిల్ పిటిషన్ పై విచారణను వాయిదా వేసింది హైకోర్టు. దసరా సెలవుల తర్వాత విచారిస్తామని తెలిపింది. ఇందులో భాగంగా… బెయిల్ పిటిషన్ విచారణను వెకేషన్ బెంచ్‌కు బదిలీ చేసింది. మరోవైపు చంద్రబాబు వ్యక్తిగత డాక్టర్‌తో వైద్య పరీక్షలకు హైకోర్టు అనుమతిచ్చింది.
More Stories
కె వి రావుకు సి పోర్టు షేర్లు తిరిగి ఇచ్చేసిన అరబిందో!
అయోధ్య రామయ్యకు టిటిడి పట్టువస్త్రాలు
గిరిజనులు వ్యాపార రంగంలోకి రావాలి