టీఎంసీ ఎంపీపై ఆరోపణలను ఎథిక్స్‌ కమిటీకి పంపిన స్పీకర్‌

టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంట్‌లో ప్రశ్నలు లేవనెత్తేందుకు డబ్బులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే చేసిన సంచలన ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపాయి. బీజేపీ ఎంపీ నిషికాంత్ తీవ్ర ఆరోపణలు చేస్తూ రాసిన లేఖను  స్పీకర్‌ ఓం బిర్లా ఎథిక్స్‌ కమిటీకి పంపారు.  ఈ ఎథిక్స్‌ కమిటీకి చైర్మన్‌గా బీజేపీ ఎంపీ వినోద్‌ కుమార్‌ సోన్‌ఖర్‌ ఉన్నారు.
కాగా, అదానీ గ్రూప్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా మాట్లాడేందుకు వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీ నుంచి టీఎంసీ ఎంపీ రూ.కోట్లలో డబ్బులు తీసుకున్నారని లేఖలో నిషికాంత్‌ దూబే ఆరోపించారు.  2019 నుంచి 2023 మధ్య మహువా మొయిత్రా అడిగిన 61 ప్రశ్నల్ 50 దర్శన్‌ హీరానందానీ కోరిక మేరకు అడిగినవేనని, ఇందుకు సంబంధించిన సాక్ష్యాలను సుప్రీంకోర్టు న్యాయవాది తనకు అందించారని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఎంపీ మొయిత్రా తన లోక్‌సభ అకౌంట్‌ యాక్సె్‌సను సైతం వ్యాపార వేత్తకు ఇచ్చారని ఆరోపించారు.  2005లో వెలుగు చూసిన.. ‘ప్రశ్నలకు లంచాలు’ ఉదంతం అప్పట్లో సంచలనం సృష్టించిందని, 11 మంది ఎంపీలను 23 రోజుల రికార్డు సమయంలో సస్పెండ్‌ చేశారని దూబే ప్రస్తావించారు. ప్రస్తుత పరిస్థితి కూడా దీనికి భిన్నమేమీ కాదన్నారు.
మొయిత్రా పార్లమెంటరీ హక్కులను ఉల్లంఘించారని, సభను ధిక్కరించారని, మోసపూరిత కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు.  ఈ నేపథ్యంలో మొయిత్రా లంచాల వ్యవహారంపై ఐపీసీలోని సెక్షన్‌ 120-ఏ కింద కేసు నమోదు చేయాలని, విచారణ కమిటీని నియమించి, ఆమెపై చర్చలు తీసుకోవాలని స్పీకర్‌ ఓం బిర్లాను కోరారు. అదేవిధంగా అదానీ గ్రూప్‌, ప్రధాని నరేంద్ర మోదీలను మొయిత్రా టార్గెట్‌ చేశారని పేర్కొన్నారు.

ఈ ఆరోపణలపై మొయిత్రా స్పందిస్తూ ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. ఆమె మంగళవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించి తన పరువుకు నష్టం కలిగించేలా ఎలాంటి ఆధారాలు లేని విషయాలను బీజేపీ ఎంపీ దూబే, సుప్రీం కోర్టు న్యాయవాది, పలు మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయని, వీటిని తక్షణమే నిలువరించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థించారు. 

తనను అపఖ్యాతిపాల్జేసిన ఎంపీ దూబే, న్యాయవాది జై అనంత్‌ దెహద్రాయ్‌, సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌, గూగుల్‌, యూట్యూబ్‌ సహా 15 మీడియా సంస్థల నుంచి నష్టపరిహారం ఇప్పించాలని తన పిటిషన్‌లో ఆమె  కోరారు.

మొయిత్రాపై ఆరోపణలు

1. లోక్‌సభలో ఎంపీ మొయిత్రా అడిగిన 61 ప్రశ్నల్లో 50 ప్రశ్నలు ప్రముఖ వ్యాపారి దర్శన్‌ హీరానందాని గ్రూపు, ఆయన వర్గానికి చెందినవే. ఈ ప్రశ్నల్లో ఎక్కువగా అదానీ గ్రూపును టార్గెట్‌ చేసుకున్నారు. ప్రతి ప్రశ్నకు నగదు, బహుమతులు అందుకున్నారు.

2. గత కొన్నేళ్లుగా ఎంపీ మొయిత్రా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలను లక్ష్యంగా చేసుకున్నారు. అదానీ గ్రూపుపై ప్రశ్నలు సంధిస్తూ మోదీ ప్రభుత్వాన్ని తాను ఇరకాటంలో పడేస్తున్నానే ప్రచారం పొందే ప్రయత్నం చేశారు. ఇది కుట్ర పూరిత చర్య.

3.  పార్లమెంటులో ఎంపీ మొయిత్రా నోటి దురుసుతో విరుచుకుపడతారు. గట్టిగట్టిగా కేకలు వేస్తూ సభలో ఇతర సభ్యులకు అడుగడుగునా అవాంతరాలు సృష్టిస్తారు. దీన్ని ఇతర సభ్యుల రాజ్యాంగ హక్కులపై దాడిగా పరిగణించాలి.

4. ఎంపీ మొయిత్రా అవినీతి వ్యవహారం ముసుగు తొలిగిపోయింది. ‘పార్లమెంటులో ఫైర్‌ బ్రాండ్‌’ అనే ముద్ర వేయించుకుని ఎంజాయ్‌ చేస్తూ పార్లమెంటరీ వ్యవస్థను అపఖ్యాతి పాల్జేశారు.