స్వలింగ వివాహాలపై సుప్రీం తీర్పును స్వాగతించిన ఆర్ఎస్ఎస్

స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్దత లేదని, సంబంధిత విషయాలపై పార్లమెంట్ చర్చించి “తగిన” నిర్ణయాలు తీసుకోవచ్చని పేర్కొంటూ  సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) స్వాగతించింది. స్వలింగ సంపర్కుల వివాహాలపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతించాల్సిందేనని ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు.
 
దీనికి సంబంధించిన అన్ని అంశాలను మన ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ సీరియస్‌గా చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోవచ్చు అని ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్‌గా పిలిచేవారు)లో సూచించారు. “స్వలింగ వివాహాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్వాగతించదగినది. మన ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ దీనికి సంబంధించిన అన్ని అంశాలను తీవ్రంగా చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోగలదు” అని పేర్కొన్నారు.
 
ఈ పరిణామంపై బీజేపీ రాజ్యసభ ఎంపీ, సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ వ్యాఖ్యానిస్తూ స్వలింగ వివాహాలపై సుప్రీంకోర్టు తీర్పు న్యాయ సమీక్ష పరిమితులను గుర్తిస్తుందని, ఈ అంశం పార్లమెంట్, ప్రభుత్వ పరిధిలో ఉందని అంగీకరిస్తోందని తెలిపారు. “ఒకసారి కోర్టు లోతైన పరిశీలన తర్వాత వివాహం లేదా వివాహానికి సమానమైన సివిల్ యూనియన్ రాజ్యాంగ హక్కు కాదని, చట్టం ద్వారా అందించబడిన హక్కు అని నిర్ధారించింది. ఈ అంశంపై దాని అధికార పరిధి నిలిచిపోయింది” అని జెఠ్మలానీ చెప్పారు.
 
దీనికి సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించేందుకు కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని, ఆ కమిటీ సంబంధితులు అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని తగు సిఫార్సులు చేయాలనీ న్యాయస్థానం తన తీర్పులో కేంద్ర ప్రభుత్వాన్ని కోరినందున స్వలింగ వ్యక్తులకు తగు న్యాయం జరగగలదని భరోసా వ్యక్తం చేశారు.
 
విశ్వహిందూ పరిషత్ హర్షం 
కాగా,  స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించడాన్ని విశ్వహిందూ పరిషత్ మంగళవారం స్వాగతించింది.   “స్వలింగ సంపర్కులకు” బిడ్డను దత్తత తీసుకునే హక్కును ఇవ్వకూడదని కోర్టు నిర్ణయం కూడా “మంచి అడుగు” అని పేర్కొంది.
 
“హిందూ, ముస్లిం, క్రైస్తవ అనుచరులతో సహా సంబంధిత అన్ని పక్షాల వాదనలను విన్న సుప్రీంకోర్టు, వివాహ రూపంలో ఇద్దరు స్వలింగ సంపర్కుల మధ్య సంబంధాన్ని నమోదు చేసుకోవడానికి అర్హత లేదని నిర్ణయం ఇచ్చినందుకు మేము సంతృప్తి చెందాము. ఇది వారి ప్రాథమిక హక్కు కూడా కాదు’’ అని వీహెచ్‌పీ జాతీయ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అలోక్‌ కుమార్‌ తెలిపారు. “స్వలింగ సంపర్కులకు బిడ్డను దత్తత తీసుకునే హక్కు ఇవ్వకపోవడం కూడా మంచి చర్య” అని ఆయన పేర్కొన్నారు.