డిసెంబర్‌లోపు విశాఖ నుంచే పాలన కొనసాగిస్తా

 
”డిసెంబర్‌లోపు విశాఖకు మారతాను. విశాఖ నుంచే పాలన కొనసాగిస్తాం” అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. సోమవారం విశాఖపట్నంలోని రుషికొండలో ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్‌ నూతన కార్యాలయాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభిస్తూ త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన అందించనున్నట్లు స్పష్టం చేశారు.
 
విభజన తర్వాత హైదరాబాద్‌ నగరాన్ని కోల్పోవాల్సి వచ్చిందని, ఇప్పటికైనా మించి పోయింది ఏమి లేదని విశాఖను అభివృద్ధి చేసుకోవాల్సి ఉందని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అన్ని అనుకూలతలు ఉన్న నగరం ఇదొక్కటే అని స్పష్టం చేశారు. విభజనతో హైదరాబాద్‌ వంటి నగరం నగరం ఇప్పటి వరకు ఆంధ్రాకు లేకుండా పోయిందని చెప్పారు. ఈ తరహా ఐటీ పరిశ్రమలు రావడం వల్ల విశాఖ కూడా త్వరగా ఎదుగుతుందని చెప్పారు.
 
ఈ ఏడాది చివర అంటే డిసెంబరు నెల లోపు ఈ మార్పు ఉంటుందని ప్రకటించారు. హైదరాబాద్‌, బెంగళూరు మాదిరిగా వైజాగ్‌లో అపారమైన అవకాశాలు ఉన్నాయని జగన్‌ తెలిపారు. వైజాగ్‌ కూడా ఐటి హబ్‌గా మారుతుందని, ఇప్పటికే విద్యాసంస్థల కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. ఏటా 15 వేల మంది ఇంజనీర్లు తయారవుతున్నారని చెప్పారు. విశాఖలో ప్రతిష్టాత్మక విద్యా సంస్థాలు ఉన్నాయని, మెడికల్, ఇంజనీరింగ్, డిగ్రీ కాలేజీలతో 12-15వేల మంది ఏటా ఇంజనీర్లు విశాఖ నుంచి వస్తున్నారని చెప్పారు. 14 ఇంజనీరింగ్ కాలేజీలు, 4మెడికల్ కాలేజీలు, 12 డిగ్రీ కాలేజీతో ఎడ్యుకేషనల్ హబ్‌గా విశాఖ ఉందన్నారు.
 
రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం విశాఖ అని చెబుతూ అంతర్జాతీయ విమానాశ్రయం, పొడవైన తీర ప్రాంతం విశాఖ సొంతం అని చెప్పారు. ఇలాంటి సౌకర్యాలన్నీ ఉన్నందునే ప్రముఖ సంస్థలు అనేకం విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని హర్షాన్ని వ్యక్తం చేశారు.  కంపెనీలు ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తే చాలు వారికి కావాల్సిన సదుపాయాలన్నీ కల్పిస్తామని ముఖ్యమంత్రి భరోసానిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు కూడా అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
 
 ఈ సందర్భంగా ఇన్ఫోసిస్‌ అధికారులు మాట్లాడుతూ ఎపిలో హైబ్రీడ్‌ వర్కింగ్‌ మోడల్‌లో వెయ్యిమందికిపైగా ఉద్యోగావకాశాలు వస్తాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐటి నిపుణులకు కొదవలేదని చెప్పారు.