విశాఖలో కృష్ణా బోర్డు ఏర్పాటుపై వివాదం

ఏపీ ప్రభుత్వం నిర్ణయం మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ను విశాఖపట్ణణం తరలించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న తరుణంలో రైతులు, రైతు సంఘాల నుంచి భిన్నాప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా బోర్డును విజయవాడలో లేదా కర్నూలులో ఏర్పాటు చేయాలని డిమాండ్‌ ఊపందుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పరిపాలనా రాజధానిగా నిర్ణయించిన విశాఖపట్టణం వైపు మొగ్గు చూపింది.

కృష్ణా జలాలను ప్రారంభంలోనే ఒడిసిపట్టి దిగువ ప్రాంతాలకు నీరందించే శ్రీశైలం ప్రాజెక్టు కర్నూలు జిల్లాలోనే ఉన్నందున అక్కడే బోర్డును ఏర్పాటు చేయాలని రాయలసీమలోని రైతులు, ప్రజా సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. నాగార్జున సాగర్‌, పులిచింతల, కృష్ణా బరాజ్‌లకు కేంద్రబిందువులుగా ఉన్న విజయవాడలో బోర్డును ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ కూడా ఉంది. 

ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014, సెక్షన్‌ 85 ప్రకారం గోదావరి బోర్డును తెలంగాణలో, కృష్ణా బోర్డును ఏపీలో నెలకొల్పేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందాలు కుదిరాయి.  2014 నుంచి 2019 దాకా ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం, 2019 నుంచి అధికారంలో కొనసాగుతున్న వైసీపీ ప్రభుత్వాలు కృష్ణా బోర్డును విజయవాడకు తరలించాలని కేంద్రానికి అనేకసార్లు విజ్ఞప్తులు చేశాయి. 

అయితే, మూడు రాజధానులపై నిర్ణయం ప్రకటించాక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మార్చుకుని విశాఖకు బోర్డును తరలించాలని కేంద్ర జలశక్తిని కోరింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కృష్ణా నది ఆయకట్టుదారులైన రైతాంగానికి నష్టం చేసినట్టే అవుతుందని కొన్ని రైతు సంఘాలు వాదిస్తున్నాయి.

కృష్ణా నది ప్రవాహంతో ఏమాత్రం సంబంధంలేని విశాఖలో బోర్డును నెలకొల్పితే రైతాంగం ఏ సమస్య చెప్పుకోవాలన్నా 400 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుందనీ, బోర్డు అధికారులకు నీటి పంపకాలపై పర్యవేక్షణ కూడా లోపిస్తుందని వారు వాదిస్తున్నారు. 

శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి అందే కృష్ణా జలాలను ఏపీ, తెలంగాణకు పంపకం చేసే విషయంలో అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తుంటారు. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పాక్షికంగా పశ్చిమగోదావరి జిల్లాలకు వివిధ ప్రాజెక్టుల ద్వారా కృష్ణా నీరు అందుతుంది. కృష్ణా నది మీద శ్రీశైలం రిజర్వాయర్‌, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్‌ ఉన్నాయి.

శ్రీశైలం రిజర్వాయర్‌ పరిధిలో తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ, కల్వకుర్తి, ఎస్‌ఎల్బీసీ, తెలంగాణలో నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాల కింద స్థిరీకరించిన ఆయకట్టు ఉంది. చివరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కూడా శ్రీశైలం రిజర్వాయరే ఆధారం. 

రాష్ట్రంలోని కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి ఇపుడు బోర్డు కార్యకలాపాలు కొనసాగిస్తున్న హైదరాబాద్‌ కంటే విశాఖ 300 నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నేపథ్యంలో కర్నూలు, విజయవాడల్లో ఏదో ఒక ప్రాంతాన్ని ఎంచుకుని బోర్డును నెలకొల్పాలని రైతు సంఘాలు కోరుతున్నాయి.  వరద జలాలు వృధా కాకుండా సద్వినియోగం చేసుకోవటంతోపాటు శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి చేపట్టే విద్యుదుత్పాదన పర్యవేక్షణలో అధికారులు సమర్దవంతంగా వ్యవహరించాలంటే బోర్డును స్థానికంగానే నెలకొల్పాలని డిమాండ్‌ ఊపందుకుంటుంది. 

కాగా, పరిపాలనా వ్యవహారాలకే పరిమితమైన కృష్ణా బోర్డును విశాఖలో నెలకొల్పినా కృష్ణా ఆయకట్టు రైతాంగానికి ఎలాంటి నష్టం లేదని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంతకాలం హైదరబాద్‌లోనే బోర్డు ఉందన్న సంగతిని గుర్తు చేస్తోంది. విధాన నిర్ణయాలు తీసుకునే కొన్ని ప్రధాన కార్యాలయాలు పరిపాలనా రాజధానిలో ఉంటే రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ సులువగా ఉంటుందని, రైతులకు మరింత చేకూరుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.