మన అంతరిక్ష సాంకేతికతను అడిగిన అమెరికా

చంద్రయాన్ 3 విజయంతో అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది. అంతకు ముందే చంద్రయాన్ 3 అభివృద్ధి కార్యకలాపాలను పరిశీలించిన అమెరికా అంతరిక్ష నిపుణులు సంబంధిత సాంకేతికతను తమతో పంచుకోవాలని కోరినట్టు ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ తెలిపారు.

కాలం మారిందని, భారత్ సైతం అత్యుత్తమ పరికరాలు, రాకెట్‌లను తయారు చేయగలదని, అందుకే ప్రధాని మోదీ  భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌కు ద్వారాలు తెరిచారని చెప్పారు. మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 92 వ జయంతి సందర్భంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామేశ్వరంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి సోమనాథ్ ప్రసంగించారు.

చంద్రయాన్3 వ్యోమనౌకను తయారు చేసిన తర్వాత నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ లేబొరేటరీ నిపుణులను ఆహ్వానించామని, ఐదారుగురు నిపుణులు అక్కడ నుంచి వచ్చి అంతా పరిశీలించారని, తామెలా రూపొందించామో, ఇంజినీర్లు ఏ విధంగా కష్టపడ్డారో, చంద్రుడిపై ఏ విధంగా ల్యాండ్ చేయనున్నామో తదితర విషయాలు వారికి చెప్పామని సోమనాధ్ పేర్కొన్నారు.

చాలా తక్కువ ఖర్చుతో సులభంగా, అత్యాధునిక సాంకేతికతతో ఎలా మన శాస్త్రీయ పరికరాలు తయారు చేశారో వారు అడిగారని, ఈ సాంకేతికతను అమెరికాతో ఎందుకు పంచుకోకూడదని వారు అడిగారని సోమనాథ్ గుర్తు చేసుకున్నారు. 

‘‘చంద్రయాన్‌-3 వ్యోమనౌకను రూపొందించిన తర్వాత అమెరికా నుంచి నాసాకు చెందిన జెట్‌ ప్రొపల్షన్‌ లేబొరేటరీ (జేపీఎల్‌) నిపుణులను ఇక్కడకు ఆహ్వానించాం. చంద్రయాన్‌-3 గురించి వివరించాం. చంద్రయాన్‌-3లో మనం వినియోగించిన శాస్త్రీయ పరికరాలను చూసిన నాసా నిపుణులు.. తక్కువ ఖర్చుతో అత్యాధునిక సాంకేతికత కలిగి ఉన్న పరికరాలను వాడారని కొనియాడారు. దీన్ని ఎలా రూపొందించారు..? ఈ టెక్నాలజీని మీరు అమెరికాకు ఎందుకు అమ్మకూడదు..? అని అడిగారు’’ అని సోమనాథ్‌ తెలిపారు.

చెన్నైలో అగ్నికుల్‌, హైదరాబాద్‌లో స్కైరూట్‌ సంస్థలు రాకెట్లను నిర్మిస్తున్నాయని.. ఇలాగే అంతరిక్ష సాంకేతికతలో భారత్‌ను మరింత శక్తివంతం చేసేదిశగా రాకెట్లు, ఉపగ్రహాల తయారీకి ముందుకు రావాలని ప్రజలకు సోమనాథ్‌ పిలుపునిచ్చారు. కలాం జయంతి సందర్భంగా రామేశ్వరంలో ఆదివారం నిర్వహించిన హాఫ్‌ మారథాన్‌ను సోమనాథ్‌ లాంఛనంగా ప్రారంభించారు.

కలాం సిద్ధాంతాన్ని అనుసరించాలని యువతను ఉద్దేశించి ఆయన సూచించారు. కలలు కనడం అనేది చాలా శక్తివంతమైన పరికరమని, అందుకే రాత్రుళ్లు కాకుండా, నిద్ర నుంచి లేచిన తరువాత కలలు కనండని కలాం చెప్పేవారని ఆయన కలాంను గుర్తు చేశారు.

వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే లక్ష్యంతో ఇస్రో చేపట్టిన గగన్‌యాన్‌ మిషన్‌ కీలక పరీక్షలకు సిద్ధమవుతోంది. ఈ మిషన్‌లో కీలకమైన క్రూ ఎస్కేప్‌ వ్యవస్థ పనితీరుని ప్రదర్శించే టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌-1 (టీవీ-డీ1) పరీక్షను తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి ఈ నెల 21 నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ తెలిపారు. ఈ పరీక్ష తర్వాత దీనికి మరో మూడు (డీ2, డీ3, డీ4) పరీక్షలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.