కేంద్ర పథకాల నిధులు రూ. 2,019 కోట్లపై కేంద్ర ఆరా!

వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం విడుదల చేసిన రూ. 2,019 కోట్లు  ఏమైనాయని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం  ప్రశ్నించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ నుండి రాష్ట్రానికి అందిన లేఖ అధికారవర్గాల్లో చర్చనీయాంశమైంది. సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ ఖాతాల్లో ఈ మొత్తం జమ కాని విషయాన్ని కేంద్రం ప్రస్తావించినట్లు సమాచారం.

కేంద్రం విడుదుల చేసిన మొత్తంతో పాటు, రాష్ట్ర వాటాగా విడుదుల చేయాల్సిన మొత్తాన్ని కూడా ఇంత వరకు విడుదల చేయని విషయాన్ని కూడా కేంద్రం ప్రశ్నించినట్లు తెలిసింది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి గతంలో కూడా ఈ తరహా పరిస్థితి నెలకొన్నట్లు తెలిసింది. ఏపీ ప్రభుత్వం కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్నల్టు ఇప్పటికే రాష్త్ర బీజేపీ అధ్యక్షురాలు డి పురందేశ్వరి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఫిర్యాదు కూడా చేశారు.

అత్యవసరమైనప్పుడు నిధులను ఇతర పథకాలకు వాడుకోవడం కొత్తేమి కాదని, అన్ని రాష్ట్రాలూ ఈ తరహాలోనే వ్యవహరిస్తుంటాయని అధికారులు అంటున్నారు. ఆ మొత్తాన్ని సాధ్యమైనంత త్వరగా సర్ధుబాటు చేస్తామని, అందువల్ల పథకం అమలుపై ప్రభావం పడకుండా చూసుకుంటామని చెబుతున్నా రు. 

సింగల్ నోడల్‌ ఏజెన్సీ, ఎస్‌ఎల్‌ఎస్‌ (స్టేట్‌ లిరక్‌ స్కీమ్స్‌), ఇ-కుబేర్‌ వంటి విధానాలను కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెరమీదకు తెస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు తాము ఇస్తున్న నిధులకు రాష్ట్ర వాటాగా జమ చేస్తున్న మొత్తానికి తప్పనిసరిగా రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయింపులు చూపాలని కేంద్రం కోరుతోంది. ప్రతియేటా కేంద్రం నురచి కేంద్ర ప్రాయోజిత పథకాల కింద భారీగా నిధులు వస్తుంటాయి.

ఈ నిధులకు రాష్ట్రం తన వాటా భరిస్తూ పథకాలకు అమలు చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను సింగల్ నోడల్‌ ఏజెన్సీ ఖాతాలను ఏర్పాటుచేసి, వాటి ద్వారానే పథకాలు అమలు చేయాలని కేంద్రం నిర్దేశించింది.  ఒక్కో పథకానికి ఒక్కో ఎస్‌ఎన్‌ఏ ఏర్పాటుచేయాలని, వాటిని కేంద్ర ఆధీనంలోని ఖాతాకు అనుసంధానం చేయాలని స్పష్టం చేసింది.

ఆర్థిక ఇబ్బందులు ఇంకా పూర్తి స్థాయిలో కొలిక్కి రాని నేపథ్యంలో రాష్ట్ర, కేంద్ర నిధులనుఇతర అవసరాలకు వాడుకోవాల్సి వస్తుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. అందుకే కేంద్రం నుంచి వచ్చిన నిధులను పూర్తి స్థాయిలో ఎస్‌ఎన్‌ఏ ఖాతాల్లోకి మళ్లించలేకపోతున్నామని వారంటున్నారు. అయినప్పటికీ 80 శాతానికి పైగా నిధులను ఎస్‌ఎన్‌ఏలోకి బదలాయిస్తున్నామని చెబుతున్నారు.

అయినప్పటికీ కేంద్రం నుంచి నిధులపై వత్తిడి రోజురోజుకూ పెరుగుతున్నట్లు సమాచారం. తాజాగా కేంద్రం నుంచి మరో లేఖ రాష్ట్ర ఆర్థికశాఖకు చేరినట్లు తెలిసింది. ఇందులో ఏకంగా రూ. 2019 కోట్లు ఇంకా ఎస్‌ఎన్‌ఎ ఖాతాల్లోకి చేరలేదని చెబుతూ ఆ నిధులపై ఆరా తీసింది. ఈ నిధులు ఎందుకు జమ చేయలేదని కూడా ప్రశ్నించినట్లు తెలిసింది.