దాయాదిపై ఏడు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం!

సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ఆతిథ్య భారత్ వరుస విజయాలతో అదరగొడుతోంది. శనివారం  అహ్మదాబాద్ లోని  నరేం ద్ర మోదీ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హ్యాట్రిక్ విజయం సాధించిన భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. 
 
అంతేగాక ప్రపంచకప్‌లో దాయాది పాకిస్థాన్‌పై తన అజేయ రికార్డును భారత్ మళ్లీ కాపాడుకుంది. వన్డే వరల్డ్‌కప్ లో పాకిస్థాన్‌పై 8వ విజయాన్ని టీమిండియా నమోదు చేసింది. ఈ క్రమంలో శ్రీలంకపై పాకిస్థాన్‌కు ఉన్న 8 విజయాల అజేయ రికార్డును భారత్ సమం చేసింది. అహ్మదాబాద్‌లో క్రిక్కిరిసి ప్రేక్షకుల సమక్షంలో జరిగిన మ్యాచ్‌లో దాయాది పాక్‌పై భారత్ ఏకపక్ష విజ యం సాధించింది. భారత్ ధాటికి ఎదురు నిలువలేక పాక్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.
ముందుగా బౌలింగ్‌తో రఫ్ఫాడించిన భారత్.. ఆ తర్వాత సూపర్ బ్యాటింగ్‌తో పాకిస్థాన్ పతనాన్ని శాసించింది. వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా హ్యాట్రిక్ కొట్టింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను, రెండో మ్యాచ్‌లో ఆప్ఘనిస్తాన్‌ను ఓడించిన భారత్ మూడో మ్యాచ్‌లో దాయాది పాకిస్థాన్‌పైనా విజయం సాధించింది. దీంతో వరుసగా మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుని ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని ఆక్రమించింది.
 
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 42.5 ఓవర్లలో 191 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ బాబర్ ఆజామ్(58 బంతుల్లో 7 ఫోర్లతో 50), మహమ్మద్ రిజ్వాన్(69 బంతుల్లో 7 ఫోర్లతో 49) మినహా అంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(2/19), మహమ్మద్ సిరాజ్(2/50), హార్దిక్ పాండ్యా(2/34), కుల్దీప్ యాదవ్(2/35) రెండేసి వికెట్లు తీయగా, రవీంద్ర జడేజా(1/35)‌కు ఓ వికెట్ దక్కింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ 30.3 ఓవర్లలో 3 వికెట్లకు 192 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. రోహిత్ శర్మ(63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్స్‌లతో 86) తృటిలో శతకం చేజార్చుకోగా.. శ్రేయస్ అయ్యర్(62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించాడు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది రెండు వికెట్లు తీయగా.. హసన్ అలీ ఓ వికెట్ తీసాడు.

స్వల్ప లక్ష్యచేధనకు దిగిన భారత్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. వరుస బౌండరీలతో జోరు కనబర్చిన శుభ్‌మన్ గిల్(16)‌ను షాహిన్ షా అఫ్రిది క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ(16)‌తో రోహిత్ ధాటిగా ఆడాడు. అయితే కోహ్లీని షాట్ పిచ్ బాల్‌తో హసన్ అలీ పెవిలియన్ చేర్చాడు. దాంతో టీమిండియా పవర్ ప్లేలో 2 వికెట్లకు 79 పరుగులు చేసింది.

అనంతరం ధాటిగా ఆడిన రోహిత్ శర్మ 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి వేగంగా పరుగులు చేశాడు. సెంచరీకి చేరువైన రోహిత్ శర్మను షాహిన్ షా అఫ్రిది బోల్తా కొట్టించాడు. భారీ షాట్ ఆడే ప్రయత్నంలో రోహిత్ వికెట్ పారేసుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్(18 నాటౌట్) సాయంతో శ్రేయస్ అయ్యర్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. 62 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న శ్రేయస్ అయ్యర్.. బౌండరీతో భారత విజయ లాంఛానాన్ని పూర్తి చేశాడు.