చంద్ర‌బాబుకు స్కిన్ ఎల‌ర్జీ… ఆరోగ్యంపై కుటుంభ సభ్యుల ఆందోళన

* అత్యవసరంగా ఏసీ సౌకర్యం.. ఏసీబీ కోర్టు ఆదేశం 
ఐదు వారాలకు పైగా రాజమండ్రి జైలులో రేమండ్ లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యం గురించి ఒక వంక కుటుంభం సభ్యులు, టిడిపి శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, ప్రభుత్వ అధికారులు, అధికారపక్ష నేతలు కొట్టిపారేస్తున్నారు. ఈ సందర్భంగా మూడు రోజుల క్రితం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు విడుదల చేసిన నివేదిక ఇప్పుడు బైటకు వచ్చి ఆయన ఆరోగ్య పరిష్టితులపై ఆందోళనకు దారితీస్తుంది.
 
స్కిన్ అలర్జీతో బాధపడుతున్నారని అంటూ చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన కీలక నివేదిక బయటకు వచ్చింది. అయితే పోలీసులు చెబుతున్న విషయాలకు భిన్నంగా వైద్యుల నివేదిక ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబుకు చేతులు, మెడ, ఛాతీ, గడ్డం, వీపు భాగాల్లో దద్దుర్లు, స్కిన్‌ అలర్జీ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.
 
చంద్రబాబునాయుడుకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతూ ఆయన లాయర్లు దాఖలు చేసిన హౌస్‌మోషన్ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు శనివారం విచారణ చేపట్టింది. రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుకు ఏసీ సౌకర్యం కల్పించాలని ఏసీపీ కోర్టు న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఆన్‌లైన్ ద్వారా విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు న్యాయమూర్ అత్యవసరంగా ఏసీ సౌకర్యం కల్పించాలని ఆదేశాలు ఇచ్చారు. వెంటనే జైలు అధికారులు శనివారం రాత్రి ఆయనకు ఏసీ సదుపాయం కల్పించారు.
 
ఈనెల 12వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ఆదేశాలతో వైద్యులు జి.సూర్యనారాయణ, వి.సునీతదేవిలతో కూడిన వైద్యుల బృందం చంద్రబాబును పరీక్షించి జైలు అధికారులకు నివేదిక అందించారు. చంద్రబాబుకు చల్లని వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో పాటు ఐదు రకాల మందులను వైద్యులు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
 

ప్రభుత్వ వైద్యుల నివేదిక ప్రకారం చంద్రబాబుకు ఆరోగ్యసమస్యలు తీవ్రంగా ఉన్నట్లు ఆయన వ్యక్తిగత వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వైద్యుల నివేదికను బయటపెట్టకుండా ఇప్పటి వరకు అంతా బాగుందంటూ జైలు అధికారులు చెబుతున్నారని కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.

 
చంద్రబాబుకి హైపర్‌ ట్రోపిక్‌ కార్డియో మైయోపతి సమస్య ఉందని, ఈ సమస్య కారణంగా డీహైడ్రేషన్‌తో గుండెపైనా ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన వ్యక్తిగత వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్య సమస్యలను ప్రభుత్వం, అధికారులు చిన్నవి చేసి చూపిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
 
“వైద్యుల నివేదికను కోర్టు దృష్టికి తీసుకువెళతాం. చంద్రబాబుకు 24 గంటలు వైద్యం అందిస్తాం. చంద్రబాబు వ్యక్తిగత వైద్యులతో డాక్టర్ల బృందం మాట్లాడారు. ఆయన వ్యక్తిగత వైద్యులు సూచిస్తే అవసరమైన వైద్య పరీక్షలు చేస్తాం. జైలుకు వచ్చినప్పుడు వాతావరణం మారుతుంది. ఇంటి వద్ద వాతావరణానికి భిన్నంగా ఉంటుంది.” అని జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ తెలిపారు.
 
శనివారం చంద్రబాబుతో నారా లోకేష్, భువనేశ్వరి ములాఖత్ అయ్యారు. ములాఖత్ అనంతరం ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన నివేదికను చూపించి చంద్రబాబు అనారోగ్యంపై డీఐజీ రవి కిరణ్‌ని లోకేష్ నిలదీశారు. చంద్రబాబుకు ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు ఓ పక్క స్పష్టంగా నివేదిక ఉన్నప్పటికీ  ప్రజలను తప్పుదోవ పట్టించేలా డీఐజీ ప్రకటనలు ఇవ్వడాన్ని ప్రశ్నించారు.
 
చంద్రబాబుకు సౌకర్యాలపై అధికారులకు వైద్యులు సూచన చేసి 48 గంటలు దాటినా ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఒక మాజీ ముఖ్యమంత్రి విషయంలో ఇంత దారుణంగా వ్యవహరిస్తారా? అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అనారోగ్యంపైనా దాచిపెట్టడం, డాక్టర్ నివేదికలు తొక్కి పట్టడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తి చేశారు.