దాడులు, ప్రతిదాడులతో దద్దరిల్లుతున్న ఇజ్రాయెల్‌, గాజా

ఇజ్రాయెల్‌, హమాస్‌ మధ్య యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగుతున్నది. తమ భూభాగంలోకి చొరబడిన హమాస్‌ బలగాలను ఇజ్రాయెల్‌ సైన్యం మట్టుపెట్టే పనిలో పడింది. ఇప్పటి వరకు దాదాపు 1,500 మంది హమాస్‌ మిలిటెంట్లను హతమార్చినట్టు ఇజ్రాయెల్‌ మంగళవారం వెల్లడించింది.  యుద్ధం ఐదోరోజుకు చేరుకోగా, ఇరుపక్షల ఆధిపత్యపోరులో రెండు దేశాల్లో ఇప్పటివరకు 3 వేల మందికిపైగా మరణించారు.

ఈ మారణహోమంలో పాలస్థీనా కంటే ఇజ్రాయెల్‌లో ఎక్కువ మంది మృతిచెందారు. దాడులలో హమాస్‌కు కీలకమైన ఇద్దరు నేతలు మృతిచెందారు.  గాజాపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో హమాస్‌ సెకండ్‌-ఇన్‌-చీఫ్ సహా ఉగ్రవాద గ్రూపునకు నిధులు సమకూర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్న పాలిట్‌బ్యూరో నేత మృతిచెందారు.

హమాస్‌ ఉగ్ర సంస్థకు గాజాస్ట్రిప్‌ ప్రభుత్వాధినేత మొహమ్మద్‌ డెయిఫ్‌ చీఫ్‌గా ఉండగా, సెకండ్‌-ఇన్‌-చీఫ్ గా జకారియా అబూ ముఅమ్మర్‌, ఆర్థిక మంత్రిగా, పాలిట్‌బ్యూరో సభ్యుడిగా జువాద్‌ అబూ షమల్లా ఉన్నారు.  డెయి్‌ఫతోపాటు హమాస్‌ సంస్థకు వీరిద్దరూ అత్యంత కీలక వ్యక్తులు. ముఅమ్మర్‌ హమాస్‌లకు వ్యూహకర్త కాగా.. ఉగ్రవాద సంస్థకు కావాల్సిన నిధులు, ఆయుధాలను సమకూర్చడంలో షమల్లాది కీలక భూమిక.

మంగళవారం ఐడీఎఫ్‌ జరిపిన వైమానిక దాడుల్లో వీరిద్దరూ చనిపోయారు. ఇజ్రాయెల్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించినా హమాస్‌ తరఫున ఎలాంటి ప్రకటన వెలువడలేదు.  కాగా, సరిహద్దుల్లోని తమ భూభాగాన్ని తిరిగి నియంత్రణలోకి తీసుకొన్నామని ఇజ్రాయిల్ తెలిపింది. మరోవైపు, గాజా వైపు నుంచి సరిహద్దులవైపు ఎవరొచ్చినా కాల్చివేయాలని తమ బలగాలకు ఇజ్రాయెల్‌ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.

ఇజ్రాయెల్‌లో హమాస్‌ సృష్టించిన మారణహోమంలో మరణాల సంఖ్య 1000 దాటింది. గాజా, వెస్టుబ్యాంకులపై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో 770 మంది మరణించారని పాలస్తీనా అధికారులు వెల్లడించారు. తమ భూభాగాల్లోకి చొరబడిన హమాస్‌ మిలిటెంట్లు దాదాపు 150 మంది సైనికులు, సాధారణ పౌరులను బందీలుగా తీసుకెళ్లినట్టు ఇజ్రాయెల్‌ వెల్లడించింది. ఈ నేపథ్యంలో వారికి ఏమైనా హాని తలపెడితే సహించేది లేదని ఇజ్రాయెల్‌ విదేశాంగ శాఖ మంత్రి హెచ్చరించారు.

గాజా సరిహద్దుల్లో ఉన్న తమ ప్రాంతాలను తిరిగి నియంత్రణలోకి తీసుకున్నామని ఇజ్రాయెల్‌ సైన్యం ప్రకటించింది. మరోవైపు అత్యాధునిక ఆయుధాలతో కూడిన అమెరికా విమానం బుధవారం ఉదయం ఇజ్రాయెల్‌కు చేరింది.  భారీ యుద్ధ విమాన వాహక నౌక మధ్యధరా సముద్ర తీరానికి చేరిందని, అమెరికా నుంచి మందుగుండు సామగ్రి సరఫరా అయ్యిందని పేర్కొన్నారు.
మరోవైపు, హమాస్‌ ఆధీనంలో ఉన్న బందీల విడుదలపై దౌత్య మార్గాల్లో పలు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. బందీలను ప్రాణాలతో విడుదల చేయకుంటే హమాస్‌ ఉనికే లేకుండా చేస్తామని ఇజ్రాయెల్‌ హెచ్చరించింది. అయితే, గాజాలో హెచ్చరికలు లేకుండా దాడులు చేస్తే వారిని చంపేస్తామని హమాస్‌ బెదిరింపులకు దిగింది. హమాస్‌ను అంతం చేసి మధ్య ఆసియాలో శాంతి నెలకొల్పడమే తమ లక్ష్యమని ఇజ్రాయేల్ ప్రధాని ప్రకటించారు.