భారత్‌- కెనడా విదేశాంగ మంత్రుల రహస్య చర్చలు?

ఖలిస్థానీ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందని ఆరోపించడమే కాకుండా.. అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టపై బురదజల్లే ప్రయత్నం చేసిన కెనడాకి, ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవడం లేదు. అత్యంత సన్నిహిత దేశాలైన అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా కేవలం ప్రకటనలతో సరిపెట్టాయి.  న్యూజిలాండ్ అయితే ప్రకటన కూడా చేయలేదు.

ఈ అంశంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తొందరపాటుతో వ్యవహరించినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కెనడా ఆరోపణలను ఖండించిన భారత్, ఈ విషయంలో తమకు ఆధారాలు ఇస్తే పరిశీలిస్తామని ప్రకటించింది. తదనంతర పరిణామాలతో కెనడా పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది. భారత విదేశాంగ మంత్రి జై శంకర్ తో కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ కొన్ని రోజుల క్రితం వాషింగ్టన్ లో చర్చలు జరిపినట్టు సమాచారం.

ఈ విషయాన్ని బ్రిటిష్ వార్తా పత్రిక ‘ఫైనాన్షియల్ టైమ్స్’ రిపోర్ట్ చేసింది. కాకపోతే ఈ భేటీని కెనడా, భారత్ ధ్రువీకరించలేదు. ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ప్రతిష్టంభన నెలకొన్న తరుణంలో కొన్ని రోజుల కిందట వారిద్దరూ భేటీ అయ్యి సంక్షోభాన్ని నివారించడంపై చర్చించినట్లు  ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. హర్దీప్ సింగ్ నిజ్జర్ అంశాన్ని ప్రైవేటుగా పరిష్కరించుకోవాలని అనుకుంటున్నట్టు మెలానీ ఈ నెల మొదట్లో ప్రకటించారు. 

భారత్ తో నెలకొన్న ద్వైపాక్షిక ప్రతిష్టంభనను తొలగించుకునే ఉద్దేశ్యంతో కెనడా ఉన్నట్టు తెలుస్తోంది. భారత్ తో వివాదాన్ని పెద్దది చేసుకోవాలని అనుకోవడం లేదని కెనడా ప్రధాని ట్రూడో సైతం ప్రకటించారు. కాగా, ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్‌ హత్యలో భారత ఏజెన్సీల ప్రమేయం ఉందని, దీనికి సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆ దేశ పార్లమెంట్‌లో ప్రకటించడంతో పాటు  భారత్‌ సీనియర్‌ దౌత్యాధికారిని కెనడా నుంచి పంపివేశారు.
ఈ ఆరోపణలను భారత్‌ ఖండిస్తూ  ప్రతిగా కెనడా దౌత్యాధికారిని భారత్‌ నుంచి బహిష్కరించింది. మరోవైపు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత దెబ్బతినడంతో కెనడా దౌత్యాధికారుల తరలింపునకు భారత్‌ ఇటీవల డెడ్‌లైన్‌ విధించింది. దీంతో సుమారు 30 మంది కెనడా దౌత్యవేత్తలను భారత్‌ నుంచి మలేషియా, సింగపూర్‌కు ఆ దేశం తరలించింది. 

ఖలిస్థానీ హత్య విషయంలో భారత్‌పై ఆరోపణలు చేసిన నేపథ్యంలో కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో పాపులారిటీ ఆ దేశంలో దారుణంగా పడిపోయిందని, ఆయన రేటింగ్‌ ఆల్‌టైమ్‌ కనిష్ఠ స్థాయికి దిగజారిందని ఎన్డీటీవీ సర్వేలో వెల్లడైంది. భారత్‌లో కెనడా సంబంధాలు ముఖ్యమని 62 శాతం మంది అభిప్రాయపడగా, ట్రూడో ఆరోపణల తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయని 65 శాతం మంది చెప్పారు.