మోదీపై భరోసాతో తెలంగాణాలో బిజెపికి అవకాశం ఇవ్వండి

ప్రధాని నరేంద్ర మోదీపై  భరోసా ఉంచి ఈసారి తెలంగాణలో బిజెపికి అవకాశం ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా తెలంగాణ ప్రజలను కోరారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో మేధావులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొంటూ మోదీ నాయకత్వంలో దేశం ప్రగతిపథంలో దూసుకుపోతోందని,  అనేక రంగాల్లో భారతదేశం అగ్రస్థానానికి చేరబోతోందని తెలిపారు.

కుటుంబ, అవినీతి పార్టీ చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టొద్దని అమిత్​ షా తెలంగాణ ప్రజలను హెచ్చరించారు. బీఆర్​ఎస్​ కుటుంబ పార్టీనని పేర్కొంటూ కేటీఆర్‌​ను సీఎం చేయడం తప్ప కేసీఆర్‌​కు మరో విధానం అన్నదే లేదని అమిత్​ షా విమర్శించారు.కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయటానికి, కవిత జైలుకు పోకుండా కాపాడుకోవటానికి కేసీఆర్ ప్రయత్నాలు చేశారని కేంద్ర మంత్రి ఆరోపించారు. 

మజ్లిస్‌​తో దోస్తీ కారణంగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేసీఆర్​ నిర్వహించలేదని ధ్వజమెత్తారు. కేంద్రం రెండేళ్లుగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తోందని చెప్పారు. బీజేపీ అధికారికంలోకి రాగానే గ్రామగ్రామాన తెలంగాణ విమోచన దినోత్సవాలు అధికారికంగా నిర్వహిస్తామని, బీజేపీకి అవకాశమిస్తే  తెలంగాణను అభివృద్ధిలో ముందుంచుతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. 

నీళ్లు, నిధులు, నియామకాలపైనే తెలంగాణ పోరాటం జరిగిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.  కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో వేల కోట్లు దోచుకున్నారని అమిత్ షా ఆరోపించారు. మోదీ  సర్కార్ ​ తెలంగాణకు తొమ్మిదేళ్లలో రూ. 9 లక్షల కోట్లను ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.  రాష్ట్రానికి కేసీఆర్​  ఏం చేశారని ఇక్కడి ప్రజలు అడుగుతున్నారన్నారని అమిత్ షా చెప్పారు.

‘‘కుటుంబ, అవినీతి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ను పక్కన కూర్చోపెట్టుకోనే ప్రశ్నలేదు. మజ్లిస్‌తో కలసి ప్రభుత్వాన్ని నడుపుతోన్న కేసీఆర్‌ను బీజేపీ దగ్గరకు రానివ్వదు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ వేర్వేరు కాదు. కేసీఆర్ హామీ ఇచ్చిన నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షలు నెరవేరలేదు” అని చెబుతూ  తెలంగాణ ప్రజలు తమ ఓటును ఈసారి బీజేపీకి వేయాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ ప్రజలను ఓటు అడిగే హక్కు కేసీఆర్‌​కు లేదని ఆయన స్పష్టం చేశారు. ఇది అమృత కాలం అంటూ సంకల్పం తీసుకోవాల్సిన కాలమని చెప్పారు. బీజేపీ హయాంలో 12 కోట్ల మందికి ఇళ్లు నిర్మించి ఇచ్చామని, . మోదీ  ప్రభుత్వం 9 కోట్ల మందికి గ్యాస్​ కనెక్షన్లు ఇచ్చిందని తెలిపారు. నరేంద్ర మోదీ  నేతృత్వంలోనే కరోనా​ను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని స్పష్టం చేశారు. కరోనా​  వ్యాక్సిన్లను రాహుల్​ గాంధీ ఎద్దేవా చేశారని మండిపడ్డారు. 

డిజిటల్​  చెల్లింపుల వ్యవస్థను దేశవ్యాప్తం చేసిన ఘనత మోదీకే దక్కుతుందని తెలిపారు.  బీఆర్​ఎస్​ ప్రభుత్వ స్టీరింగ్​ ఎంఐఎం చేతుల్లో ఉందని అమిత్ షా ధ్వజమెత్తారు. కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ నాటకాలు ఆడుతున్నాయని చెబుతూ వారెన్ని నాటకాలు ఆడినా ప్రజలు నమ్మబోరని, తెలంగాణాలో బిజెపి జెండా ఎగరబోతోందని కేంద్ర మంత్రి ధీమా వ్యక్తం చేశారు.