న్యూజెర్సీలో అతిపెద్ద హిందూ ఆలయం అక్షరధామ్

భారత్‌ వెలుపల నిర్మించిన అతి పెద్ద హిందూ దేవాలయం అమెరికాలో లాంఛనంగా ప్రారంభమైంది. న్యూజెర్సీలోని రాబిన్స్‌విల్లేలో నిర్మించిన అక్షర్‌ధామ్‌ ఆలయాన్ని ఆదివారం మహంత్‌ స్వామి మహరాజ్‌ సమక్షంలో భారీ వేడుక నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు.
 
ఆలయం ప్రతిష్ఠ మహోత్సవాలను పురస్కరించుకుని సెప్టెంబరు 30 నుంచి 9 రోజులపాటు ఉత్సవాలు నిర్వహించారు. మొత్తం 183 ఎకరాల విస్తీర్ణంలో స్వామి నారాయణ్ ఆలయ నిర్మాణాన్ని 2011లో ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 12,500 మంది వాలంటీర్లు ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వాములయ్యారు.
 
న్యూయార్క్‌ నగర మేయర్‌ కార్యాలయ డిప్యూటీ కమిషనర్‌ (అంతర్జాతీయ వ్యవహారాలు దిలీప్‌ చౌహాన్‌ మాట్లాడుతూ ఈ ఆలయ నిర్మాణంతో అమెరికాలోని అక్షర్‌ధామ్‌ ఆలయ వాలంటీర్లు, భక్తుల కల నెరవేరినట్లైందని చెప్పారు. కొలంబియా యూనివర్సిటీ రెలిజియన్ స్కాలర్ యోగి త్రివేది ‘నేను ప్రతిరోజూ మాదిరిగానే ఉదయాన్నే నిద్రలేచాను.  నేను సెంట్రల్ న్యూజెర్సీలో ఉన్నానా? అని ఆలోచిస్తూ నా కళ్లను నేనే నమ్మలేకపోయాను.. ఇది మరొక ప్రపంచానికి ప్రత్యేకంగా భారతదేశానికి తీసుకెళ్లింది’ అని తెలిపారు.

అక్టోబరు 8న ఆలయాన్ని అధికారికంగా ప్రారంభించిన,18 నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. భారతీయ అమెరికన్లు, హిందూ అమెరికన్లకు ఇది ఒక మైలురాయి వంటిందని త్రివేది అన్నారు. ‘ఇది అమెరికన్ల కల.. భారత్, ఆసియా వెలుపల ఉన్న ఒక పవిత్రమైన ప్రదేశంలో ఉన్నాం.. న్యూజెర్సీలో వీటన్నింటిని అనుభవించవచ్చు.. పూజలు చేసుకోవచ్చు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఇది ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా మారుతుందని ఒక మత పండితుడిగా నేను ఆశిస్తున్నాను’ అని త్రివేది వ్యాఖ్యానించారు. 

 
రాబిన్స్‌విల్లే టౌన్‌షిప్‌లో 2011లో ఆక్షరధామ ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. 183 ఎకరాల్లో అక్షర్‌ధామ్‌ పేరుతో నిర్మితమైన ఈ ఆలయాన్ని ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి విచ్చేస్తున్న హిందువులు, ఇతర మతస్థులు దర్శించుకుంటున్నారు. ఆలయంలో మొత్తం 10 వేల విగ్రహాలు, శిల్పాలు ఉంటాయని అంచనా. 
ఒక ప్రధాన గర్భగుడి, 12 ఉపాలయాలు, 9 శిఖరాలతో పాటు భారీ గుమ్మటాన్ని అక్షర్‌ధామ్‌లో చూడొచ్చు.
బ్రహ్మకుండ్‌ అనే పేరుతో ఏర్పాటు చేసిన సంప్రదాయ బావిలో ప్రపంచవ్యాప్తంగా 300 నదుల నుంచి సేకరించిన జలాలను కలిపారు.  ఈ ఆలయ గోడలపై మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, అబ్రహాం లింకన్ వంటి చారిత్రక వ్యక్తుల శిల్పాలను కూడా చెక్కారు. ఈ మందిరంలోకి వస్తే అన్ని వర్గాలకు చెందిన వ్యక్తులను చూస్తారు.
అన్ని కులాలు, సామాజిక నేపథ్యాలు, తినడం, ప్రార్థనలు చేయడం, ప్రేమించడం, కలిసి సేవ చేయడం అన్ని ఇక్కడ ఉన్నాయని త్రివేది పేర్కొన్నారు. 
రాబిన్స్‌విల్లే టౌన్‌షిప్‌లో 2 మిలియన్ క్యూబిక్ అడుగుల రాయిని ఉంచడం చిన్న విషయం కాదని త్రివేది అన్నారు. ఈ ఆలయం ఒక సాంస్కృతిక మిశ్రమని, ప్రపంచం నలుమూలల నుంచి సేకరించిన సామాగ్రిని ఉపయోగించామని చెప్పారు.