కేసీఆర్ ను గద్దె దించుదాం రండి.. అమిత్ షా

కేసీఆర్ ను గద్దె దించి బిజెపికి అధికారం ఇచ్చేందుకు పిడికిలి బిగించాలని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా పిలుపిచ్చారు. తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే మొదటగా ఆదిలాబాద్ లో బీజేపీ జరిపిన జనగర్జన బహిరంగసభలో మంగళవారం మాట్లాడుతూ  తెలంగాణలో బీజేపీ రాజ్యం తీసుకురావాలని కోరారు.

సీఎం కేసీఆర్‌ పదేళ్లుగా పేదల సమస్యలు పట్టించుకోలేదని ఆరోపించారు. రైతులు, దళితులు, గిరిజనులను పట్టించుకోకుండా, కేవలం కేటీఆర్‌ను సీఎం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్‌ సర్కార్ రావాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. మోదీ నాయకత్వంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని అమిత్ షా చెప్పారు. డిసెంబరు 3న తెలంగాణలో బీజేపీ జెండా ఎగరాలని అమిత్‌ షా స్పష్టం చేశారు.

ఆదిలాబాద్ లో నినాదిస్తే, హైదరాబాద్ లో సీఎం కేసీఆర్ వినిపించాలని అమిత్ షా కోరారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి జిల్లాలో సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచనాదినంగా నిర్వహిస్తామని తెలిపారు. కేసీఆర్ కేవలం తన కుటుంబం కోసమే పనిచేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ తన కుమారుడు, కుమార్తె గురించి మాత్రమే ఆలోచిస్తారని, ప్రధాని మోదీ దేశం కోసం ఆలోచిస్తారని చెప్పారు. 

ఆదివాసీల అభివృద్ధికి బీజేపీ ఎన్నో పథకాలు తీసుకొచ్చిందని చెబుతూ ప్రధాని మోదీ 9 ఏళ్ల పాలనలో ఒక్క అవినీతి మరకలేదని కేంద్ర మంత్రి తెలిపారు. తెలంగాణలో ఆధునిక రజాకర్ల నుంచి ప్రజలను బీజేపీ మాత్రమే రక్షించగలదని చెప్పారు. మజ్లిస్ పార్టీ ఆదేశాలతో బీఆర్ఎస్ పనిచేస్తుందని ఆరోపించారు.

 తెలంగాణలో కొడుకు, కూతురు కోసం పనిచేసే ప్రభుత్వం కాకుండా, పేదలు, రైతులు, ఆదివాసీల కోసం పనిచేసే ప్రభుత్వం రావాలని, 2024లో మోదీని మరోసారి ప్రధాని చేయాలని కోరారు. గిరిజన యూనివర్సిటీకి ఏర్పాటుకు కేసీఆర్‌ సర్కారు భూమి కేటాయించలేదని, అందుకే వర్సిటీ ఏర్పాటులో జాప్యం జరిగిందని ఆరోపించారు. ప్రధాని మోదీ కృష్ణా ట్రిబ్యునల్‌ నిబంధనలు మార్చి తెలంగాణకు నీటి ఇబ్బంది లేకుండా చేశారని గుర్తు చేశారు.

‘‘చట్టసభలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లను మోదీ తీసుకొచ్చారు. 10 ఏండ్లలో పేదల కోసం కేసీఆర్​ ప్రభుత్వం పనిచేయలేదు. కేటీఆర్​ను సీఎం ఎలా చేయాలన్నదే కేసీఆర్​ ఆలోచించారు. కేసీఆర్​ కేవలం తన కుటుంబం కోసమే పనిచేశారు. 75 ఏండ్ల దేశ చరిత్రలో తొలిసారి ఆదివాసీ మహిళను రాష్ట్రపతి చేశాం” అని అమిత్ షా గుర్తు చేశారు. 

ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ..‘‘డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేసీఆర్ ఎంతమంది లబ్ధిదారులకు ఇచ్చారు. కొడుకు, కూతురు కోసమే కేసీఆర్ పని చేస్తున్నారు. ఆర్టికల్ 360తో కశ్మీర్‌ను కాపాడుకున్నాం. రాం మందిర్ నిర్మాణం పూర్తి కావొచ్చింది. భవ్య రాం మందిర్ జనవరి నుంచి భక్తులకు అందుబాటులోకి వస్తుంది” అని చెప్పారు. 
 
“సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్ ఉగ్ర వాదులను మట్టుపెట్టాం. తెలంగాణలో రజాకార్ల పాలన పోవాలంటే బీజేపీ అధికారంలోకి రావాలి. రైతుల ఆత్మాహత్యల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అవినీతి పాలన చేస్తోంది.” అంటూ విమర్శించారు.  “ఎన్నికలు రాగానే కొత్త దుస్తులు వేసుకుని కాంగ్రెస్​ నేతలు వస్తారు. పేదల గురించి మాట్లాడడం తప్ప వాళ్లకు కాంగ్రెస్​ చేసిందేమీ లేదు. ఇచ్చిన ఏ హామీని కేసీఆర్​ అమలు చేయలేదు. గిరిజనులకు ఎన్నో హామీలిచ్చారు. అందులో ఒక్కటీ కూడా అమలు చేయలేదు” అని అమిత్​షా ధ్వజమెత్తారు.

‘‘కుమ్రం భీమ్​ పేరు వినగానే రోమాలు నిక్కబోడుచుకుంటున్నాయి.. డిసెంబర్​ 3న తెలంగాణలో బీజేపీ సర్కారు ఏర్పడుతుంది. బీజేపీ సర్కారు వస్తే ప్రతి జిల్లాలో విమోచన దినోత్సవం నిర్వహిస్తాం. తెలంగాణకు డబులింజన్​ సర్కారు ఎంతో అవసరం. డబులింజన్​ సర్కారు ఉంటే అక్కడా, ఇక్కడా మోదీయో ఉంటారు” అని అమిత్ షా చెప్పారు. 

గిరిజన యూనివర్సిటీకి 10 ఏండ్లుగా కేసీఆర్​ సర్కారు స్థలం ఇవ్వలేదని విమర్శించారు. పసుపు రైతుల కోసం పసుపు బోర్డు కూడా ఏర్పాటు కాబోతోందని చెప్పారు.  ఆదిలాబాద్ కు హెలికాప్టర్‌లో వచ్చిన అమిత్ షాకు ఇందిర ప్రియదర్శిని స్టేడియంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, ఎంపీ సోయం బాపురావు ఘనస్వాగతం పలికారు. ఈ సభలో అమిత్ ప్రసంగించిన అనంతరం హైదరాబాద్ కు బయలుదేరివెళ్లారు.