తెలంగాణలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవ్వగానే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సోమవారం కేంద్ర ఎన్నికల కమిషన్ తెలంగాణ సహా 5 రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ లో నవంబర్ 30న ఎన్నికలు జరగనుండగా.. ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో రాష్ట్రం మొత్తాన్ని పోలీసులు అష్టదిగ్భంధనం చేశారు. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అనుమానిత వాహనాలను తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా నగదు పంపిణీ, ఇతరత్రా కార్యక్రమాలే జరిగే అవకాశం ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సరైన లెక్కా, పత్రాలు లేకుండా నగదు, బంగారాన్ని తరలించడం చేస్తే అంతే సంగతి అన్నమాట. కాబట్టి ఎన్నికల కోడ్ ముగిసేవరకు సెలబ్రిటీల నుంచి సామాన్యుల దాకా అందరూ జాగ్రత్తగా ఉండాల్సిందే.
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రజలు నగలు,నగదు వెంట తీసుకెళ్లేటప్పుడు వాటికి సంబంధించిన రసీదులు, బిల్లులు, అధికారిక పత్రాలను కూడా వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. డబ్బు రూ.50 వేలకు మించితే, ఆ డబ్బు ఎక్కడిదో, ఎవరికి ఇచ్చేందుకు తీసుకెళ్తున్నారో పత్రాలు చూపించాల్సి ఉంటుంది. అలాగే వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలూ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఏ చిన్న అనుమానమొచ్చినా డబ్బు,నగలే కాదు వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఎన్నికల వేళ గిఫ్టులు ఇచ్చి ఓటర్లను ప్రలోభ పెట్టాలి అనుకునే నేతలకు షాక్ తప్పదు. అక్రమ మద్యం సరఫరాపై కూడా పోలీసులు నిఘా పెడుతున్నారు. వాహనాల్లో భారీగా తీసుకెళ్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నగదు, మద్యం, బంగారం, డ్రగ్స్ కట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా 148 చెక్‌పోస్టులు ఏర్పాటయ్యాయి.
తెలంగాణలో ఎన్నికలో కోడ్ అమల్లోకి రావడంతో సోమవారం చెక్ పోస్టుల వద్ద తనిఖీలు జరిపిన పోలీసులు 20 కేజీలకు పైగా బంగారం, 300 కేజీలవకు పైగా వెండిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ. 3 కోట్లకు పైగా నగదును సీజ్ చేశారు. సరైన పత్రాలు చూపించిle వాటిని స్వాధీనం చేసుకుంటున్న పోలీసులు.. లెక్కా పత్రం సరిగ్గా ఉంటేనే వదిలిపెడుతున్నారు. హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో పోలీసులు తనిఖీలో 16 కిలోల బంగారంతో పాటు 300 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. బంగారం, వెండి విలువ రూ. 10 కోట్లు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. చందానగర్‌లో 6 కేజీల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ వెస్ట్, సౌత్ జోన్‌లో రూ.25 లక్షల హవాలా నగదును పోలీసులు సీజ్ చేశారు. మరో వైపు గచ్చిబౌలి గోపన్‌పల్లిలో ఓటర్లకు పంచేందుకు సిద్దంగా ఉన్న కుక్కర్లను సీజ్ చేశారు పోలీసులు. కుక్కర్లపై కాంగ్రెస్ నేత రఘునాథ్ యాదవ్ స్టిక్కర్లను గుర్తించారు. ఫిలింనగర్‌లో మద్యం సీసాలను సీజ్ చేశారు. రూ.30 లక్షల నగదు సీజ్ చేశారు. వనస్థలిపురంలో వాహనాల తనిఖీల్లో రూ. 4 లక్షలను పోలీసులు సీజ్ చేశారు.ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తనిఖీలు చేస్తున్న సమయంలో రూ. 11.50 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. చాదర్‌ఘట్‌లో రూ.9.30 లక్షలు, గోషామహల్‌లో రూ.15 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. పురానాపూల్ గాంధీ విగ్రహం వద్ద వాహనాల తనిఖీలో రూ.15 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు తనిఖీలు కొనసాగుతుండటంతో.. వివిధ అవసరాల నిమిత్తం డబ్బు పట్టు్కుని వెళ్ళేవారు సైతం ఇబ్బందులు పడుతున్నారు.

More Stories
కో లివింగ్ హాస్టల్స్‌లో అసలు ఏం జరుగుతుందో పరిశీలించాలి
మోదీ పాలన దేశ ప్రగతికి అసలైన నిదర్శనం
కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీపై బీజేవైఎం ధర్నా