తెలంగాణలో భారీగా నగదు, బంగారం స్వాధీనం

ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించడం, వెంటనే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తున్నట్లు ప్రకటించడంతో తెలంగాణలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఎక్కడ చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. అనుమానిత వాహనాలను ఆపేసి తనిఖీలు చేస్తున్నారు. 

సోమవారం  ఎక్కడికక్కడ జరిపిన తనిఖీలలో 20 కేజీలకు పైగా బంగారం, 300 కేజీలకు పైగా వెండిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూ.3 కోట్లకు పైగా నగదును సీజ్ చేశారు. సరైన పత్రాలు చూపించని వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు.  ఖమ్మం జిల్లా వైరాలో పోలీసుల తనిఖీ లో పశ్చిమ గోదావరి జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ రాజేశ్వరి నుంచి రూ.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ బషీర్‌బాగ్‌లో పోలీసులు తనిఖీలో 16 కిలోల బంగారంతో పాటు 300 కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నారు. బంగారం, వెండి విలువ రూ. 10 కోట్లు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.  చందానగర్‌లో 6 కేజీల బంగారంను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ వెస్ట్, సౌత్ జోన్‌లో రూ.25 లక్షల హవాలా నగదును పోలీసులు సీజ్ చేశారు. 

మరో వైపు గచ్చిబౌలి గోపన్‌పల్లిలో ఓటర్లకు పంచేందుకు సిద్దంగా ఉన్న కుక్కర్లను సీజ్ చేశారు పోలీసులు. కుక్కర్లపై కాంగ్రెస్ నేత రఘునాథ్ యాదవ్ స్టిక్కర్లను గుర్తించారు. ఫిలింనగర్‌లో మద్యం సీసాలను సీజ్ చేశారు. రూ.30 లక్షల నగదు సీజ్ చేశారు. వనస్థలిపురంలో వాహనాల తనిఖీల్లో రూ. 4 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. 

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తనిఖీలు చేస్తున్న సమయంలో రూ. 11.50 లక్షలను పోలీసులు సీజ్ చేశారు. చాదర్‌ఘట్‌లో రూ.9.30 లక్షలు, గోషామహల్‌లో రూ.15 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. పురానాపూల్ గాంధీ విగ్రహం వద్ద వాహనాల తనిఖీలో రూ.15 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది కాబట్టి ప్రజలు నగలు, నగదు వెంట తీసుకెళ్లేటప్పుడు వాటికి సంబంధించిన రసీదులు, బిల్లులు, అధికారిక పత్రాలను కూడా వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. డబ్బు రూ.50 వేలకు మించితే, ఆ డబ్బు ఎక్కడిదో, ఎవరికి ఇచ్చేందుకు తీసుకెళ్తున్నారో పత్రాలు చూపించాల్సి ఉంటుంది. 

అలాగే వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలూ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. డబ్బు, నగలే కాదు వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. గచ్చిబౌలిలో కుక్కర్లను పోలీసులు సీజ్ చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వాటిని తీసుకెళ్తున్నారని పోలీసులు భావించారు. 

వాటికి సంబంధించిన ఎలాంటి బిల్లులూ చూపించకపోవడంతో సీజ్ చేశారు. అందువల్ల గిఫ్టులు ఇచ్చి ఓటర్లను ప్రలోభ పెట్టాలి అనుకునే నేతలకు షాక్ తప్పదు.  అక్రమ మద్యం సరఫరాపై కూడా పోలీసులు నిఘా పెడుతున్నారు. వాహనాల్లో భారీగా తీసుకెళ్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నగదు, మద్యం, బంగారం, డ్రగ్స్ కట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా 148 చెక్‌పోస్టులు ఏర్పాటయ్యాయి.