ఉచితాలు తాలింపు లాంటివి.. వాటిని అడ్డుకోవడం కష్టం

ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచితాలను అడ్డుకోవడం కష్టమని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. ఉచిత తాయిలాలు ప్రజాకర్షణకు తాలింపు లాంటివని, ఎన్నికల్లో విజయం సాధించినవారు వాటిని అమలు చేయడం, ఆ అలవాటును నిలువరించడం కష్టమని ఆయన పెదవి విరిచారు.
 
 ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కోసం సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉచితాలపై ఈ విధంగా స్పందించారు: ‘ఒక రాష్ట్రంలో ఒక హామీ, మరో రాష్ట్రంలో మరో హామీ ఇస్తుంటారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మొత్తం ఐదేళ్లపాటు పార్టీలు ఎందుకని గుర్తుంచుకోవో నాకు అర్ధం కాదు. ఎన్నికల షెడ్యూలు విడుదలకు రెండు వారాలు లేదా నెలరోజుల ముందుగా మాత్రం వాటిని ప్రకటిస్తుంటాయి. ఏదైనా, అది రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని అంశం. ఎన్నికల హామీలను ఏ విధంగా, ఎప్పట్లోగా అమలు చేస్తారో వివరించాల్సిందిగా పార్టీల కోసం ఒక నిర్ణీత మోడల్‌ను ఈ మధ్యే అందుబాటులోకి తీసుకువచ్చాం’ అని సీఈసీ వివరించారు. 

ఏం చేయబోతారో చెప్పే స్వేచ్ఛ పార్టీలకు, వాటిని ఎలా అమలు చేస్తారో తెలుసుకునే హక్కు ఓటర్లకు ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుత భారం, భవిష్య తరాలను తాకట్టుపెట్టే పరిస్థితి మధ్య సమతౌల్యం సాధించాలని సూచించారు. ఈ విషయం ప్రస్తుతం సబ్ జడ్జి పరిధిలో ఉందని, దీనిపై నిర్ణయం తీసుకుని స్పష్టత లభించిన వెంటనే ఎన్నికల కమిషన్ చర్య తీసుకుంటుందని చెప్పారు.

జీడీపీ నిష్పత్తికి రుణం, మొత్తం ఆదాయానికి వడ్డీ చెల్లింపు, ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ లక్ష్యాలను ఉల్లంఘిస్తారా? అనే దాని గురించి పార్టీలు, ప్రభుత్వం చెప్పాలి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కొన్ని పథకాలను తగ్గిస్తారా? ప్రజలపై అదనపు పన్ను భారం పడుతుందా? అని ప్రశ్నించారు. ప్రతి విషయాన్ని ప్రజల్లోకి తీసుకురావడమే దీని వెనుక ఉద్దేశం అని రాజీవ్ కుమార్ వివరించారు.

రాజకీయ పార్టీలు తమ ఎన్నికల వాగ్దానాల అమలు సాధ్యత, ఆర్థిక పరిస్థితికి సంబంధించి ఓటర్లకు ప్రామాణికమైన సమాచారాన్ని అందజేసేలా నియావళిని సవరించాలని ఎన్నికల కమిషన్ గత ఏడాది అక్టోబరులో ప్రతిపాదించింది.