400 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన ఇజ్రాయెల్

ఇజ్రాయెల్‌, పాలస్తీనా హమాస్‌ మిలిటెంట్‌ గ్రూప్‌ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాల్చుతున్నది. దాడులు, ప్రతిదాడులతో రెండు దేశాల్లోని ప్రభావిత ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. ప్రధానంగా గాజా స్ట్రిప్‌, ఇజ్రాయెల్‌ దక్షిణ ప్రాంతంలో యుద్ధ ప్రభావం కనిపిస్తున్నది. ఇప్పటికే రెండు వైపులా 1100 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, దాదాపు 5 వేల మందికి గాయాలయ్యాయి. 
హమాస్‌ గ్రూపు దాడుల్లో ఇజ్రాయెల్‌లో 44 మంది సైనికులతోసహా దాదాపు 700 మందికి పైగా మరణించగా, 2 వేల మందికి పైగా గాయాలయ్యాయని స్థానిక మీడియా నివేదికలు పేర్కొన్నాయి. మరోవైపు ఇజ్రాయెల్‌ సైన్యం దాడుల్లో 413 మంది పౌరులు మరణించినట్టు గాజాలోని పాలస్తీనా ఆరోగ్య శాఖ వెల్లడించింది.

గాజాలో తలదాచుకుంటున్న సుమారు 400 మంది హమాస్ ఉగ్రవాదులను మట్టుబెట్టామని, పదుల సంఖ్యలో వారిని బందీలుగా పట్టుకున్నామని ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) ఆదివారం ప్రకటించింది. ఈ విషయంపై ఐడీఎఫ్ అధికార ప్రతినిధి డానియేల్ హగరి మాట్లాడుతూ హమాస్ ఉగ్రవాదుల కోసం పలు పట్టణాల్లో వేట కొనసాగుతోందని చెప్పారు.

‘ఇప్పటిదాకా కిఫర్ అజాలో దళాలు పోరాడుతున్నాయి. వేర్వేరు నగరాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అన్ని నగరాల్లో ఐడీఎఫ్ బలగాలు మోహరించాయి. ఐడీఎఫ్ లేని ఊరే లేదని’ ఓ ఇజ్రాయెల్ పత్రికతో ఆయన వ్యాఖ్యానించారు. రేర్ అడ్మిరల్ హగరి చెప్పిన వివరాల ప్రకారం దళాలు తొలుత గాజా సరిహద్దు వెంబడి నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయిస్తున్నాయి. 

అక్కడ దాడులను తగ్గించి భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. అలాగే ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకొని దాడులు కొనసాగిస్తున్నారు. ఇజ్రాయెల్ దళాలకు, హమాస్ ఉగ్రవాదులకు మధ్య కిఫర్ అజాలో భీకర పోరు కొనసాగుతోంది. ఈ ప్రాంతం గాజా సరిహద్దులో ఉంటుంది. దాంతో కనిపించిన ఉగ్రవాదులందరినీ మట్టుబెట్టేందుకు ఐడీఎఫ్ ప్రయత్నిస్తోంది.

హ‌మాస్ దాడిని ఆయ‌న యుద్ధ నేరంగా అభివర్ణిస్తూ యుద్ధ నేరంలో పాలుపంచుకున్న వారు భారీ మూల్యం చెల్లించ‌క‌త‌ప్ప‌ద‌ని ఆయన  హెచ్చ‌రించారు. ఆదివారం ఉదయం ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు హమాస్ ఉగ్రవాద సంస్థ ఇంటెలిజెన్స్ చీఫ్ నివాసం సమీపం లోని సైనిక కేంద్రాలను ఢీకొట్టాయని ఐడీఎఫ్ పేర్కొంది. అందుకు సంబంధించిన ఓ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేసింది.

హమాస్ శనివారం నుంచి చేస్తున్న దాడుల్లో మరణించిన వారి సంఖ్య ఆదివారం నాటికి 300 దాటింది. మరో 1864 మంది గాయపడినట్టు తెలిసింది. గాజాలో అనేక మంది ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా పట్టుకున్నారని ఓ ఇజ్రాయెల్ పత్రిక పేర్కొంది.  ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహు ఇప్పటికే హమాస్‌ను గట్టిగా హెచ్చరించారు.

ఐడీఎఫ్ మొత్తం శక్తి సామర్ధాలను వినియోగించి దాడులను అణచివేస్తామని ఆయన తాజాగా ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘హమాస్ దళాలు ఈ ఉదయం ఇజ్రాయెల్ భూ భాగాన్ని ఆక్రమించాయి. సెలవుదినం , షబ్బత్ రోజున అమాయక ప్రజల ప్రాణాలను బలిగొన్నారు. మృతుల్లో పిల్లలు, ముసలివాళ్లు ఉన్నారు. హమాస్ క్రూరమైన దుష్ట యుద్ధాన్ని మొదలు పెట్టింది.ఈ యుద్ధంలో విజయం మాదే. ఇది మనందరికీ చాలా కష్టమైన రోజు ’ అని పోస్ట్ పెట్టారు. 

ఇజ్రాయెల్ పౌరులందరినీ హమాస్ హత్య చేయాలని చూస్తోందని నెతన్యాహు ధ్వజమెత్తారు. అది పిల్లలు, తల్లులు మంచాలపై నిద్రిస్తుండగానే వారిని హతమార్చి శత్రువని మండిపడ్డారు. అంతేకాకుండా చిన్నారులు, యువతులు, బాలికలను హమాస్ అపహరిస్తోందని ఆరోపించారు. సరదాగా సెలవుల్ని గడిపేందుకు వెళ్లిన పిల్లలను , పౌరులను కొట్టి మరీ చంపుతున్నారని చెప్పారు. శనివారం ఇజ్రాయెల్‌లో జరిగిన ఘటనలు మరోసారి జరగకుండా చూసుకుంటానని ఆయన చెప్పారు.

మరో వైపు ఇజ్రాయెల్‌ భద్రతా మంత్రి మండలి ‘స్టేట్‌ ఆఫ్‌ వార్‌’ ఆమోదించింది.. ఆర్టికల్‌ 40 ప్రకారం సైనిక చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇజ్రాయెల్‌కు భారత్‌ నుంచి మద్దతు అందుతుందని.. పలువురు మంత్రులు, వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఫోన్‌లో మాట్లాడారని ఇజ్రాయెల్‌ అంబాసిడర్‌ నౌర్‌ గిల్లాన్‌ పేర్కొన్నారు.