బండారు అనుచిత వాఖ్యల విషయంలో వైసిపిలో ఒంటరిగా రోజా

దూకుడుగా రాజకీయ ప్రత్యర్థులపై మాటల తూటాలు పేల్చుతుండే మంత్రి రోజా ప్రస్తుతం తన పార్టీలోనే ఒంటరిగా మిగిలి పోయారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం జైలులో ఉన్న టిడిపి అధినేత  చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ తర్వాత ఆయన సతీమణి భువనేశ్వరి, కోడల బ్రహ్మణిల గురించి రోజా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో టిడిపి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ శృతిమించి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. 

వ్యక్తిగతంగా ఆమెను కించపరిచేలా బండారు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ తరపున కేవలం మహిళా కమిషన్ ఛైర్మన్ మాత్రమే అధికారికంగా స్పందించారు.  బండారు వ్యాఖ్యల తర్వాత వాసిరెడ్డి పద్మ డీజీపీకి చర్యలు తీసుకోవాలని లేఖ రాయడంతో బండారును గత వారం నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఆయన హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పై బైటకు వచ్చారు. రోజాపై బండారు చేసిన వ్యాఖ్యల విషయంలో టీడీపీ కొంత ఆత్మరక్షణలో పడింది. రోజా గతంలో తనను అలాగే అవమానించదంటూ తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత ఆరోపించారు. బండారు చేసిన వ్యాఖ్యలపై రోజాకు అనుకూలంగా వైసీపి, బండారుకు మద్దతుగా టీడీపీ సోషల్ మీడియా విభాగాలు నిత్యం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి.

అయితే వైసిపి మంత్రులు, నేతలు, ముఖ్యంగా మహిళా నాయకులు ఎవ్వరూ రోజాకు సంఘీభావంగా బైటకు రాకపోవడం రాజకీయ వర్గాలలో విస్మయం కలిగిస్తోంది. ప్రముఖ నటీమణులు అనేకమంది బండారు వాఖ్యాలను తీవ్రంగా ఖండించారు. మహారాష్ట్రలోని అమరావతి లోక్ సభ సభ్యురాలు, నటి నవనీత్ కౌర్, రాధిక, ఖుష్బూ, మీనా, రమ్యకృష్ణ, కవిత వంటి వారు  పలువురు  టీడీపీ నేత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించి తగు చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అదే సమయంలో వైసీపీలో ముఖ్యమైన మహిళా నాయకురాళ్లు ఎవరు ఇంతకాలం మాట్లాడకపోవడం చర్చనీయాంశంగా మారింది. మిగిలిన వారి పట్ల ఆమె పెద్దగా స్నేహపూర్వకంగా లేకపోవడం వల్లే తాజా వ్యవహారంలో వారి నుంచి సహానుభూతి రానట్టు తెలుస్తోంది. చివరకు పార్టీ జోక్యం చేసుకుని రోజా తరపున మాట్లాడాలని చెప్పే వరకు మిగిలిన వారు ఎవరు స్పందించకపోవడానికి ఇదే కారణంగా తెలుస్తోంది.

వైసీపీ ప్రస్తుత హోం మంత్రి తానేటి వనిత, వైద్యశాఖ మంత్రి విడదల రజిని, మంత్రి ఉషశ్రీ చరణ్‌ ఈ వారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నా రోజా ప్రస్తావన మాత్రం చేయలేదు. వీరితో పాటు మాజీ మంత్రి సుచరిత, పుష్పశ్రీవాణి సహా పెద్ద సంఖ్యలో మహిళలు ఉన్నా రోజాతో వారికి ఉన్న సంబంధాలు అంతంత మాత్రం కావడం వల్లే అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నట్లు  తెలుస్తోంది.

చివరకు రోజానే బైటకు వచ్చే ఈ విషయంలో బండారును వదిలిపెట్టేది లేదని, న్యాయపోరాటం కొనసాగిస్తానని ప్రకటించాల్సి వచ్చింది. తనపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంతో బాధిస్తున్నాయని  చెబుతూ, ఒక మనిషి చనిపోతే కొన్ని రోజులే బాధపడతారని, కానీ తాను ఈ నిందలను జీవితాంతం భరించాల్సిందేనా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళలపై నీచ వ్యాఖ్యలు చేసే దుర్మార్గులు బయట తిరగకూడదని, బండారు సత్యనారాయణమూర్తికి తానేంటో చూపిస్తానని రోజా ఈ సందర్భంగా సవాల్ చేశారు. ఇకపై ఎవరైనా మహిళల పట్ల చులకనగా మాట్లాడాలంటే భయపడే పరిస్థితి తీసుకొస్తానని స్ఫష్టం చేశారు. బండారు సత్యనారాయణలాంటి చీడపురుగులను ఏరివేసేలా చట్టాలు తీసుకువచ్చేందుకు పోరాడుతానని ఆమె వెల్లడించాయిరు. అతడిపై పరువు నష్టం దావా వేసి కోర్టుకీడుస్తానని, సుప్రీంకోర్టు వరకైనా న్యాయ పోరాటం చేస్తానని రోజా ప్రకటించారు.