* సుప్రీంకోర్టులో సోమవారంకు వాదనలు వాయిదా
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో, విజయవాడలోని ఎసిబి కోర్టులో సోమవారం చుక్కెదురైంది. చంద్రబాబు దాఖలు చేసిన మూడు ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డుతో పాటు అంగళ్లు అల్లర్లు, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ కేసుల్లో బాబు పిటిషన్లను హైకోర్టు తోసిపుచ్చింది.
అదేవిధంగా, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎసిబి కోర్టు చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయడంతో పాటు సిఐడి వేసిన కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించింది. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు అల్లర్ల కేసులో చంద్రబాబు నాయుడు ఏ1గా ఉన్నారు. ఫైబర్ నెట్ కేసులో ఏ25గా ఉన్నారు. ఈ కేసుల్లో బెయిలుకోసం చంద్రబాబు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ఇటీవల వాదనలు ముగియడంతో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేశ్‌రెడ్డి తీర్పులను రిజర్వు చేశారు.
సోమవారం బాబు పిటిషన్లను తిరస్కరిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. ఈ కేసుల్లో చంద్రబాబు నాయుడు నిందితుడిగా పరిగణించాలనే పిటిషన్లు దిగువ కోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని, ముందే బెయిల్ మంజూరు చేయడం సరికాదన్న సిఐడి వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. నిజానికి కోర్టులో చంద్రబాబు పిటిషన్లకు సంబంధించి అంగళ్లు కేసులో బెయిల్ రావొచ్చని భావించారు. ఈ కేసులో నిందితులు అందరికీ బెయిల్ ఇచ్చిన నేపథ్యంలో చంద్రబాబుకు కూడా ఉపశమనం లభిస్తుందని అంతా భావించారు. కానీ ఈ కేసులో కూడా ఊరట దక్కకపోవడం గమనార్హం.
ఇలా ఉండగా, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు మంగళవారానికి వాయిదా వేసింది. సోమవారం చంద్రబాబు తరపు తరపు న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు విన్పించారు. మంగళవారం ఉదయం ఏపీ సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు విన్పించనున్నారు. తాను ఈ విషయమై వాదనలు రేపు విన్పిస్తానని సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని అభ్యర్థించగా రోహత్గీ అభ్యర్ధనను సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది.
సీఐడీ మరి కొందరి పేర్లతో మరో పిటిషన్
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్ ను హైకోర్టు కొట్టేయగానే, మరికొందరి పేర్లు జతచేస్తూ సీఐడీ మరో పిటిషన్ దాఖలు చేసింది. సీఐడీ కేసులో కొత్తగా మరో నలుగురిని అధికారులు నిందితులుగా చేర్చారు. మాజీ మంత్రి నారాయణ సతీమణి రమాదేవితో పాటు ప్రమీల, ఆవుల మణి శంకర్, రాపూరి సాంబశివరావులను నిందితులుగా చేర్చడం జరిగింది.
వారిపై ఐపీసీ 120బి, 409, 420, 34,35 37, 166, 167 రెడ్ విత్ 13(2) పి.ఒ.సి చట్టంలోని 13(1)(సి)(డి) సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశారు. ఈ పిటిషన్‌ను విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు దాఖలు చేశారు. ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన రేపు విచారణకు హాజరుకానున్నారు
More Stories
దావోస్ నుండి వట్టిచేతులతో తిరిగి వచ్చిన చంద్రబాబు
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సందేహాలపై కేంద్ర మంత్రి ఆగ్రహం
అక్రమ వలస వెళ్లిన భారతీయులను తిరిగి రప్పించేందుకు సిద్ధం