శ్రీవారి దివ్యానుగ్రహానికి అలిపిరి వద్ద నిత్య హోమం

తిరుపతిలోని అలిపిరి వద్ద ఉన్న సప్తగోప్రదక్షిణ మందిరంలో అనునిత్యం శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహించాలని టిటిడి బోర్డ్ నిర్ణయించింది. ధర్మకర్తల మండలి అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన సోమవారం తిరుమలలో సమావేశమై  ప్రపంచ‌వ్యాప్తంగా ఉన్న హిందూ భ‌క్తులు త‌మ శుభ‌కార్యాలు, విశేష‌మైన రోజుల్లో స్వామివారి అనుగ్రహం కోసం సంక‌ల్పం చెప్పుకుని య‌జ్ఞం నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. 
 
ఈ య‌జ్ఞం నిర్వహ‌ణ‌కు చెల్లించాల్సిన రుసుమును త్వర‌లో నిర్ణయిస్తామని టీటీడీ చైర్మెన్ తెలిపారు.  టీటీడీలో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీల కింద విధులు నిర్వహిస్తున్న దాదాపు 5 వేల మంది ఆరోగ్యశాఖలోని కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు, ఎఫ్‌ఎంఎస్‌ పారిశుద్ధ్య కార్మికుల వేతనాన్ని రూ.12 వేల నుండి రూ.17 వేలకు పైగా పెంచేందుకు పాలకవర్గం ఆమోదించిందని కరుణాకర్ రెడ్డి తెలిపారు.
 
అన్నమాచార్య సంకీర్త‌న‌ల‌కు విశేష ప్రాచుర్యం క‌ల్పించిన టీటీడీ ఆస్థాన సంగీత విద్వాంసులు గ‌రిమెళ్ల బాల‌కృష్ణ‌ప్ర‌సాద్‌కు ప‌ద్మ‌శ్రీ అవార్డు ప్ర‌క‌టించాల‌ని కోరుతూ కేంద్ర ప్ర‌భుత్వానికి ప్ర‌తిపాద‌న‌లు పంపాల‌ని నిర్ణ‌యించారు. టీటీడీ క‌ల్యాణ మండ‌పాల్లో వివాహాలు జ‌రిపే స‌మ‌యంలో డిజె పాటలు కాకుండా భ‌క్తిగీతాల‌తో మాత్ర‌మే సంగీత విభావ‌రి నిర్వ‌హించుకోవాల‌ని నిబంధ‌న విధించారు.
తిరుమ‌ల‌లో వేలాది మంది సామాన్య భక్తులు గోగర్భం డ్యామ్‌ సర్కిల్‌ నుండి ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై సరైన వసతులు లేని తాత్కాలిక క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉంటున్నారు. భక్తుల సౌకర్యార్థం రూ.18 కోట్లతో శాశ్వత క్యూలైన్లు, ఫుడ్‌ కౌంటర్లు, టాయ్‌లెట్లు నిర్మించనున్నారు. అదే విధంగా నారాయణగిరి విశ్రాంతి గృహం సర్కిల్‌, ఆళ్వార్‌ ట్యాంకు రోడ్డు సర్కిల్‌ వద్ద రెండు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు నిర్మించేందుకు పరిపాలన అనుమతికి ఆమోదం తెలిపినట్టుగా  టీటీడీ చైర్మెన్ తెలిపారు.
 
తిరుమల మొదటి ఘాట్‌ రోడ్‌లో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి మోకాలిమెట్టు వరకు రోడ్డు పక్కన నడిచే భక్తులు ఎండకు, వర్షానికి ఇబ్బందులకు గురికాకుండా రూ.2.81 కోట్లతో నడకదారి షెల్టర్లు నిర్మాణానికి టెండర్లు ఆమోదం.   పురాతన కట్టడాలైన శ్రీకాళహస్తి రాజగోపురం కూలడం, శ్రీరంగంలోని మహారాజగోపురానికి ఇటీవల బీటలు రావడం కనిపిస్తున్నది.
ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా భక్తుల భద్రత దృష్ట్యా ఐఐటి నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటుచేసి చాలా ఏళ్ల క్రితం నిర్మించిన టీటీడీలోని అన్ని ఆలయాలు, గోపురాల పటిష్టతను పరిశీలించి, కమిటీ నివేదిక ఆధారంగా మరమ్మతులు చేసి మరలా భావితరాల వారికి ఆలయాలు పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయ్హించారు.