తెలంగాణాలో 22 లక్షల ఓట్ల తొలగింపు

తెలంగాణాలో 2022-23 లో 22 లక్షల ఓట్లను తొలగించినట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. తెలంగాణాలో యంత్రాంగం ఎన్నికల సంసిద్ధత గురించి పరిశీలించేందుకు మూడు రోజుల పాటు పర్యటించిన ముగ్గురు కమిషనర్ల బృందం గురువారం మీడియాతో మాట్లాడుతూ అన్నింటిని పరిశీలించిన తర్వాతే ఈ ఓట్లను తొలిగించినట్లు చెప్పారు. 
 
రాష్ట్రంలో వందేళ్లు దాటిన ఓటర్లు 7,600 మంది ఉన్నారని, జులై తర్వాత దరఖాస్తు చేసుకున్న 2.21 లక్షల యువతకు ఓటు హక్కు కల్పించామని, 66 నియోజకవర్గాల్లో పురుషుల కంటే స్త్రీ ఓటర్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పారు. 18-19 ఏళ్ల యువ మహిళా ఓటర్లు 3.45 లక్షల మంది ఉన్నారని, నాలుగు గిరిజన తెగల్లో నూరు శాతం ఓటర్ల నమోదు జరిగిందని వెల్లడించారు.
 

తెలంగాణాలో ఓటర్ల సంఖ్య 3.17 కోట్లుగా ఉందని, మొత్తం 8.11 లక్షల కొత్త ఓటర్ల నమోదు చేయించుకున్నారని పేర్కొన్నారు. తమ పర్యటనలో మొదటిరోజు రాజకీయ పార్టీలతో భేటీ అయినట్లు చెప్పారు. ఎన్నికలకు సంబంధించి ఆయా పార్టీలు పలు అంశాలను తమ దృష్టికి తీసుకొచ్చాయని చెప్పారు. ప్రధానంగా ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార వ్యయాన్ని పెంచాలని కొన్ని పార్టీలు కోరాయని,  ఎన్నికల్లో మద్యం, డబ్బుల పంపిణీ ఆరికట్టే విధంగా గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పినట్లు వెల్లడించారు.

 
తెలంగాణాలో మహిళలు పురుష ఓటర్లు సమానంగా ఉన్నారని, మొట్టమొదటిసారిగా తెలంగాణలో దివ్యాంగులు, 80 సంవత్సరాలు దాటినా వారికీ ఇంటి నుంచి ఓటు వేసే అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించారు. 35,356 మొత్తం పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. “ఎన్నికల నిర్వహణ విషయంలో ఎన్నికల సంఘం పారదర్శకంగా పని చేస్తుంది. ఇందులో ఎలాంటి సందేహాం అవసరం లేదు” అని స్పష్టం చేశారు.