వచ్చే ఏడు , ఎనిమిదేళ్లలో రూ.2.53 లక్షల కోట్ల విలువైన సైనిక వ్యవస్థలు, హార్డ్‌వేర్‌లు, ఇతర పరికరాలను ప్రవేశ పెట్టాలని యోచిస్తున్నట్టు భారత వాయుసేన వెల్లడించింది. వాస్తవాధీన రేఖ వెంబడి, ముఖ్యంగా తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని తెలిపింది.
అక్టోబర్ 8 న ఎయిర్‌ఫోర్స్ డే పురస్కరించుకొని తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎయిర్‌ఫోర్స్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరీ పలువివరాలు వెల్లడించారు. రష్యా నుంచి ఇప్పటివరకు మూడు యూనిట్ల ఎస్400 క్షిపణి వ్యవస్థలను అందుకున్నామని, మిగతా రెండు వచ్చే ఏడాది నాటికి అందుతాయని ఆశిస్తున్నామని తెలిపారు.
అదనంగా 97 తేజస్ మార్క్ 1 ఏ తేలికపాటి యుద్ధ విమానాలను సేకరించేందుకు వాయుసేన ప్రయత్నాలు జరుపుతోందని చెప్పారు. తూర్పు లద్దాఖ్ లోని వాస్తవాధీన రేఖ వద్ద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని పేర్కొంటూ తమ కార్యాచరణ ప్రణాళికలు డైనమిక్‌గా ఉంటాయని ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరీ స్పష్టం చేశారు.
భౌగోళిక రాజకీయ పరిస్థితుల్లో అనిశ్చితి నెలకొంటున్న వేళ బలమైన సైనిక శక్తి అవసరమని వీఆర్ చౌధరీ పేర్కొన్నారు. ఈ క్రమంలో సైన్యానికి వాయుసేన తోడుగా నిలుస్తుందన్నారు. అగ్నిపథ్ పథకాన్ని విజయవంతం చేసేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ వదులు కోమని తెలిపారు. ఇక యుద్ధం, విపత్కర సమయాల్లో త్రివిధ దళాలు కలిసి పనిచేసే ‘థియేటరైజేషన్ ప్రాజెకు’కు సంబంధించిన ప్రణాళికలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని వాయుసేన చీఫ్ వివరించారు.
More Stories
ఢిల్లీ ఎన్నికల్లో 50 శాతం పైగా బూత్లు గెలవాలి
‘జాతీయ ఆరోగ్య మిషన్’ మరో ఐదేళ్లు పొడిగింపు
మంత్రులతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు