107 మంది ఎమ్మెల్యేలు, ఎంపిలపై ద్వేషపూరిత ప్రసంగాల కేసులు

107 మంది ఎమ్మెల్యేలు, ఎంపిలపై ద్వేషపూరిత ప్రసంగాల కేసులు ఉన్నట్లు ఓ నివేదిక పేర్కొంది. ఇటువంటి కేసులు ఉన్న 480 మంది అభ్యర్థులు గత ఐదేళ్లలో రాష్ట్ర అసెంబ్లీలతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసినట్లుఅసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌), నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌ (ఎన్‌ఇడబ్ల్యు)లు సంయుక్తంగా జరిపిన సర్వేలో ఎల్లడైనది. 

ఎంపిలు, ఎమ్మెల్యేలతో పాటు ఆ సమయంలో జరిగిన లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులు స్వయంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లను అధ్యయనం చేసినట్లు పేర్కొన్నాయి. తమపై విద్వేష ప్రసంగాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపిలు స్వయంగా పేర్కొన్నట్లు సర్వే తెలిపింది.

నివేదిక ప్రకారం యుపి (ఏడుగురు), తమిళనాడు (నలుగురు), బీహార్‌, కర్ణాటక, తెలంగాణల నుండి ముగ్గురు చొప్పున, అస్సాం, గుజరాత్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌ నుండి ఇద్దరు చొప్పున, జార్ఖండ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, ఒడిశా, పంజాబ్‌ల నుండి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 33 మంది ఎంపిలపై కేసులు ఉన్నాయి. 

వీరిలో 22 మంది బిజెపికి చెందగా, కాంగ్రెస్‌ (ఇద్దరు), ఆప్‌, ఎఐఎంఐఎం, ఎఐయుడిఎఫ్‌, డిఎంకె, ఎండిఎంకె, పిఎంకె, శివసేన (ఉద్ధవ్‌ థాకరే), విసికె పార్టీల నుండి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఓ స్వతంత్ర ఎంపిపై కూడా ఈ కేసు ఉన్నట్లు నివేదిక తెలిపింది.

కాగా, బీహార్‌, యుపిల నుండి తొమ్మిది మంది చొప్పున, ఎపి, మహారాష్ట్ర, తెలంగాణల నుండి ఆరుగురు చొప్పున, అస్సాం,తమిళనాడుల నుండి ఐదుగురు చొప్పున, ఢిల్లీ, గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌ల నుండి నలుగురు చొప్పున, జార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ల నుండి ముగ్గురు చొప్పున ఎమ్యెల్యేలపై కేసులు ఉన్నాయి. 

 అదేవిధంగా, కర్ణాటక, పంజాబ్‌, రాజస్తాన్‌ల నుండి ఇద్దరు చొప్పున, త్రిపుర, మధ్యప్రదేశ్‌ , ఒడిశాల నుండి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 74 మంది ఎమ్మెల్యేలపై కేసులు ఉన్నాయి. ఈ జాబితాలో బిజెపికి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్‌ నుండి 13 మంది, ఆప్‌ నుండి ఆరుగురు ఉన్నారు.