పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

తెలంగాణకు సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ, నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డులను ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం సమావేశమైన కేంద్ర కేబినెట  ఆమోదం తెలిపింది. కేబినెట్‌ నిర్ణయాలను కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, కిషన్ రెడ్డి వెల్లడించారు. 
 
తెలంగాణలో రూ.889 కోట్లతో సమ్మక్క-సారక్క గిరిజన యూనివర్సిటీకి ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.  అదేవిధంగా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు కూడా ఆమోదం తెలిపింది. గత వారం తెలంగాణ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ రెండింటి విషయమై ప్రకటన చేశారు. 
 
తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల కేటాయింపుపై కూడా మంత్రివర్గంలో చర్చించారు.  తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ల మధ్య మధ్య కృష్ణా జలాల పంపిణీపై వివాదాల పరిష్కారంపై కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
 
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మూడు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు  కిషన్ రెడ్డి తెలిపారు. పసుపు రైతులకు లబ్ధి చేకూరేలా జాతీయ పసుపు బోర్డు ఏర్పాటునకు కేబినెట్ ఆమోదముద్ర వేసిందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాలకు కృష్ణా ట్రిబ్యూనల్ ఏర్పాటునకు నిర్ణయించామని పేర్కొన్నారు. ప్రాజెక్టుల వారీగా నీటిని ట్రిబ్యూనల్ కేటాయిస్తుందని చెప్పారు. మిగులు జలాలను కూడా ట్రిబ్యూనల్ నిర్ణయిస్తుందని వివరించారు.
కృష్ణా జలాలపై రెండు తెలుగు రాష్ట్రాల వాటా తేల్చడంతో పాటు వివాదాల పరిష్కారానికి టైబ్యునల్ ఏర్పాటు చేస్తున్నట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కృష్ణా ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి కొత్తగా తమ వాటా తేల్చాలని తెలంగాణ పట్టుబడుతున్న నేపథ్యంలో ప్రస్తు, భవిష్యత్ అవసరాల్ని దృష్టిలో ఉంచుకునే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. దీంతో తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరుతుందని భావిస్తున్నట్లు చెప్పారు.
ఉజ్వల గ్యాస్ సిలిండర్‌పై మరో రూ.100 సబ్సిడీ
 
కాగా, వంట గ్యాస్ సిలిండర్‌పై మరో రూ.100 సబ్సిడీ ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన స్కీమ్ కింద వంట గ్యాస్ తీసుకున్నవారికి ఈ సబ్సిడీ అందనుంది. ఈ ఏడాది ఆగస్టు నెలలోనే ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులకు కేంద్రం రూ.200 మేర సబ్సిడీ ప్రకటించిన విషయం తెలిసిందే. 
 
తాజాగా మరో రూ. 100 సబ్సిడీ ఇస్తుండడంతో మొత్తం రాయితీ రూ.300కు చేరింది. ఈ నిర్ణయంతో దేశంలోని లక్షల మంది ఉజ్వల లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుంది. మరోవైపు.. ఇతర గృహ వినియోగ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఎల్‌పీజీ ప్రస్తుత మార్కట్ ధర రూ.903 ఉండగా, ఉజ్వల లబ్ధిదారులకు రూ.703కే లభిస్తోంది. కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో వారు ప్రస్తుతం రూ.603 చెల్లిస్తే సరిపోతుంది. 
అంతేకాకుడా కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ నెల నుంచి సిలిండర్ ధరను రూ.200 తగ్గించిన విషయం తెలిసిందే. అంటే ఉజ్వల స్కీమ్ లబ్ధిదారులకు మొత్తంగా రూ.400 ప్రయోజనం కలుగుతోందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మరో రూ.100 తగ్గింపు పెంపు వల్ల మొత్తంగా రూ. 500 తగ్గింపు వస్తోందని చెప్పుకోవచ్చు.