ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ

టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసులో ఎదురుదెబ్బతగిలింది. రేవంత్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు పేర్కొంది.  ఓటుకు నోటు వ్యవహారంలో ఐదుగురు సాక్షులను ఒకే సారి క్రాస్‌ ఎగ్జామిన్‌ చేయడానికి అవకాశం కల్పించాలని రేవంత్‌ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణను ముగించింది. 
 
ఓటుకు నోటు వ్యవహారంలో ఉన్న సాక్షులను విడి విడిగా క్రాస్‌ ఎగ్జామిన్‌ చేయాలని ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అందరినీ ఓకేసారి కలిపి క్రాస్‌ ఎగ్జామిన్‌ చేస్తానన్న రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తిని ప్రత్యేక కోర్టు తిరస్కరించిన విషయం విషయం తెలిసిందే. ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రేవంత్ హైకోర్టులో సవాలు చేయగా, స్థానిక కోర్టు నిర్ణయాన్ని హైకోర్టు సమర్ధించింది. 
 
దీంతో హైకోర్టు ఉత్తర్వులపై రేవంత్‌ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సాక్షులను ప్రశ్నించే విషయంలో రేవంత్‌ రెడ్డి దాఖలు చేసిన పిటషన్‌పై 2021 మే నెలలో సుప్రీం కోర్టు విచారణ జరిపింది. రేవంత్‌ రెడ్డి దాఖలు చేసిన రివిజన్‌ పిటిషన్‌‌పై ఐదు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని 2021 మే 28నజస్టిస్‌ బిఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌ల ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. 
 
తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ట్రయల్‌ కోర్టులో సాక్షుల క్రాస్‌ ఎగ్జామినేష్‌ జరగకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల తర్వాత తెలంగాణ హైకోర్టు ఎలాంటి నిర్ణయం వెలువరించలేదు. అదే విషయాన్ని ఈరోజు విచారణ సందర్భంగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌విఎన్‌ భట్టి ధర్మాసనానికి రేవంత్‌ రెడ్డి తరపు న్యాయవాదులు తెలిపారు. 
 
హైకోర్టును నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చినందున ఇకపై కేసు విచారణ సుప్రీంకోర్టులో అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. పిటిషన్‌‌పై తదుపరి నిర్ణయం హైకోర్టు పరిధిలో ఉంది కాబట్టి విచారణను ముగిస్తున్నట్లు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌విఎన్‌ భట్టి ధర్మాసనం ప్రకటించింది. దీంతో రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసు విచారణ హైకోర్టులో జరుగనుంది.
 
మరోవంక, ఓటు నోటు కేసుపై అక్టోబర్ 4న సుప్రీంలో మళ్లీ విచారణ జరగనుంది. ఓటుకు నోటు కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముద్దాయిగా చేర్చాలని సుప్రీంకోర్టులో గతంలో ఎపిలోని మంగళగిరి ఎంఎల్‌ఎ ఆళ్ల రామకృష్ణ రెడ్డి రెండు పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ఎసిబి నుంచి ఓటుకు నోటు కేసును సిబిఐ అప్పగించాలని మరో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. 2015లో తెలంగాణలో ఎంఎల్‌సి ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే.