రూ. 2,000 నోట్ల మార్పిడికి 7 వరకు గడువు

రూ. 2 వేల నోట్లను తిరిగి బ్యాంకుల్లో జమ చేయడానికి, లేదా ఇతర నోట్లతో మార్చుకోవడానికి చివరి తేదీ సెప్టెంబర్ 30 కాగా, ఈ గడువును మరో వారం పాటు ఆర్బీఐ పొడగించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ. 2000 నోట్లను మే 19 నుంచి చలామణిలోంచి తొలగించింది. ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2,000 నోట్లను బ్యాంకుల వద్ద మార్చుకోవడానికి 4 నెలల గడువు ఇచ్చింది. 
 
ఆ గడువు సెప్టెంబర్ 30వ తేదీతో ముగుస్తోంది. కానీ ఆ గడువును ఆర్బీఐ మరో వారం పాటు పొడిగించింది.  మార్కెట్లో నుంచి రూ. 2000 నోట్లు ఇంకా బ్యాంకుల్లోకి పూర్తిగా తిరిగి రానందున మరికొంత కాలం గడవు పొడిగించాలని ఆర్బిఐ నిర్ణయించింది. ముఖ్యంగా, ఎన్నారైలు, ఇతర వ్యాపార వర్గాలు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను ఇంకా బ్యాంకులో జమ చేయనందున గడువు పొడిగించాలని ఆర్బిఐ నిర్ణయించింది. 
 
అందువల్ల రూ. 2 వేల నోట్లను బ్యాంకుల్లో జమ చేయడానికి, లేదా ఏదైనా బ్యాంక్ శాఖల్లో, పోస్ట్ ఆఫీస్ ల్లో మార్చుకోవడానికి తుది గడువును అక్టోబర్ 7 వరకు పొడిగించింది. రూ. 2000 నోట్లను మార్కెట్లోకి తీసుకు వచ్చిన ఉద్దేశం నెరవేరినందున వాటిని చలామణి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
 
ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 2 వేల నోట్లను సెప్టెంబర్ 30 లోగా, తమ బ్యాంకు ఖాతా లో జమ చేసుకోవచ్చని లేదా ఏదైనా బ్యాంక్ శాఖలో రోజుకు రూ. 40000 గరిష్ట పరిమితితో మార్చుకోవచ్చని తెలిపింది.  ఇప్పటివరకు రూ. 2 వేల నోట్లు 93% వరకు తిరిగి బ్యాంకులకు వచ్చినట్లు ఆర్బీఐ సెప్టెంబర్ 2న ప్రకటించింది.