మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు

తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన ఓటుకు నోటు కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసు ఈ నెల 4న సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఓటుకు నోటు కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ముద్దాయిగా చేర్చాలంటూ మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
 
అంతేకాదు, తెలంగాణ ఏసీబీ నుంచి ఓటుకు నోటు‌ కేసును సీబీఐకి బదిలీ చేయాలంటూ మరో పిటిషన్ వేశారు. 2017లో ఈ పిటిషన్లను ఆర్కే దాఖలు చేయగా ఈ నెల 4న లిస్టయింది. అయితే అంతకు ముందు రోజే చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసు విచారణ జరగనుంది.  అది జరిగిన తర్వాతి రోజే ఓటుకు నోటు కేసు విచారణకు వస్తుండటం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
ఈ కేసును సుప్రీంకోర్టులో జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ధర్మాసనం దగ్గర ఓటుకు నోటు కేసును విచారించనుంది. గతంలో మొత్తం రేవంత్ రెడ్డి చుట్టే తిరిగిన ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపైన ఎమ్మెల్యే ఆర్కే సుప్రీం కోర్టును ఆశ్రయించటం ఇప్పుడు సంచలనంగా మారింది. 
 
2015లో తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటుకు నోటు కేసు వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నిక కోసం టీడీపీకి మద్దతు తెలపాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ మద్దతును ప్రస్తుత టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరే సందర్భంలో సూట్‌కేసులతో రూ. 50 లక్షలు ఇస్తూ కెమెరాకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. 
 
అయితే, ఆ డబ్బులు ఇచ్చింది చంద్రబాబేనని ఎమ్మెల్యే ఆర్కే ఆరోపిస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో రేవంత్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో.. స్టీఫెన్‌సన్‌ను రేవంత్ రెడ్డి కలిసి డబ్బులు ఇస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అయ్యాయి. 
ఈ కేసులో రేవంత్ రెడ్డి కొన్నాళ్ల పాటు జైలులో కూడా గడిపారు.  ఆ తర్వాత బెయిల్ మీద బయటకు రాగా, తర్వాత పరిణామాలతో ఈ కేసు కాస్త మరుగున పడిపోయింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలని ఏసీబీ కోర్టు ఆదేశించగా  హైకోర్టు స్టే విధించింది. 
 
కాగా, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆర్కే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ కేసు హైకోర్టులో విచారణలో ఉన్నందున తాము జోక్యం చేసుకోబోమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. కాగా, ఇప్పుడు మరోసారి ఈ కేసు తెరపైకి రావటం, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టై జైల్లో ఉన్న సందర్భంలో ఈ కేసుపై విచారణ జరగనుండటం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా సంచలనంగా నిలిచింది.