
“నా మీద రాళ్లు విసిరితే.. వాటితో భవంతులు కడతా” అంటూ తనపై బిఆర్ఎస్ మంత్రులు చేస్తున్న విమర్శలపై తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందర్య రాజన్ ఘాటుగా స్పందించారు. తనపై దాడి చేసి రక్తం చూస్తే.. ఆ రక్తంను సిరగా మార్చి తన చరిత్ర రాస్తానని వెల్లడించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజ్‌భవన్‌లో గవర్నర్ ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో మాట్లాడుతూ ఎన్ని అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు.
తాను తెలంగాణ గవర్నర్ గా వచ్చినపుడు తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌లో మహిళా మంత్రులు లేరని ఆమె గుర్తు చేశారు. తాను గవర్నర్ అయిన తర్వాత మహిళా మంత్రులతో ప్రమాణం చేయించిన పరిస్థితి ఉందని తెలిపారు.
తెలంగాణలో కొందరు తనను రాజకీయ నాయకురాలు అంటారని చెబుతూ అది నిజమే కదా అంటూ బిఆర్‌ఎస్ నేతలకు చురకలు అంటించారు. గవర్నర్ కంటే ముందు నేను రాజకీయ నాయకురాలి.. దాంట్లో రహస్యం, దాచి పెట్టడానికి ఏమీ లేదని వెల్లడించారు. రాజకీయాల్లో అవకాశాల కోసం మహిళలు చాలా కష్టపడాల్సి ఉంటుందని ఆమె సూచించారు.
‘నాపై పువ్వులు వేసే వారు ఉన్నారు.. రాళ్లు వేసే వారు కూడా ఉన్నారు. నాపై రాళ్లు వేస్తే.. వాటితో భవంతి కడతా. నాపై పిన్స్ వేస్తే.. ఆ పిన్స్ గుచ్చుకుని వచ్చే రక్తంతో నా చరిత్ర బుక్ రాసుకుంటా. అందరూ అందరికీ నచ్చాలని లేదు. నాపై పువ్వులు వేసినా.. రాళ్లు వేసినా ఆహ్వానిస్తా.’ అని తమిళిసై పేర్కొన్నారు.
అయితే, మంచి పనులు చేయడానికి అధికారం ఉండాలని, ఎలాంటి అవమానాలు పట్టించుకోనని ప్రజల కోసం పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు. లోక్‌సభ, శాసనసభలో 33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందటం ఆనందంగా ఉందని ఆమె చెప్పారు. గత 27 ఏళ్లుగా ఈ బిల్లు గురించి మాట్లాడుతున్నారు కానీ అమలు కాలేదని పేర్కొన్నారు.
ఓ మహిళా రాష్ట్రపతి ఈ బిల్లుపై సంతకం చేయటం హర్షణీయమని ఆమె తెలిపారు. రాజకీయాలపై ఇష్టంతోనే వైద్యవృత్తిని పక్కన పెట్టాల్సి వచ్చిందని చెబుతూ ప్రోటోకాల్ ఇచ్చినా ఇవ్వకున్నా పనిచేసుకుంటూ పోతానని గవర్నర్ తమిళిసై వెల్లడించారు.
More Stories
హైదరాబాద్ శివాలయంలో మాంసపు ముద్దలు
బీజేపీలోకి ఇద్దరు కాంగ్రెస్ నేతలు ప్రవేశం
కుంభమేళాకు వెళ్లి వస్తుండగా 8 మంది తెలంగాణ వాసుల మృతి