పోక్సో చట్టం కింద సమ్మతి వయస్సు తగ్గింపుకు వ్యతిరేకత

లైంగిక కార్యకలాపాలకు పోక్సో చట్టం నిర్దేశిస్తున్న అంగీకార వయసును తగ్గించాలన్న వాదనను లా కమిషన్‌ వ్యతిరేకించింది. ప్రస్తుతం 18 ఏండ్లుగా ఉన్న ఈ అంగీకార వయసును 16 ఏండ్లకు తగ్గిచాలన్న ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది.  అంగీకార వయసును తగ్గిస్తే బాల్య వివాహాలను, బాలల అక్రమ రవాణాను అరికట్టడంపై ప్రత్యక్షంగా ప్రతికూల ప్రభావం పడుతుందని న్యాయ మంత్రిత్వ శాఖకు సమర్పించిన నివేదికలో హెచ్చరించింది.”
 ”పోక్సో చట్టం ప్రకారం ప్రస్తుతమున్న సమ్మతి వయస్సు 18 ఏళ్లను మార్చడం సరి కాదు. ఒకవేళ, సమ్మతి వయసును తగ్గిస్తే.. అది బాల్య వివాహాలు, పిల్లల అక్రమ రవాణాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది” అని లా కమిషన్‌ తమ నివేదికలో పేర్కొంది.  లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే పోక్సో చట్టం ప్రకారం 18 ఏండ్లలోపు బాలబాలికలతో శృంగార కార్యకలాపాలు జరపడం నేరం.
వారి అంగీకారంతో చేసినా అది చట్టవిరుద్ధమే.  దీంతో ఈ చట్టం ద్వారా యుక్తవయసులో ఉన్నవారి మధ్య సంబంధాన్ని నిర్వచించడంపై కొన్ని సందర్భాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ఈ నేపథ్యంలో 16-18 ఏండ్ల వయసు ఉండి, పరస్పర ఆమోదంతో కలయికలో పాల్గొన్నవారి కేసులను పరిష్కరించేందుకు వీలుగా న్యాయమూర్తులకు మార్గదర్శకాలతో కూడిన విచక్షణాధికారాలను కల్పించాలని లా కమిషన్‌ సూచించింది.
 
”16-18ఏళ్ల పిల్లలకు సంబం ధించిన కేసుల్లో వారు తమ సమ్మతిని తెలియ జేస్తే..అది కౌమారదశలోని అనియంత్రిత ప్రేమనా? లేదా క్రిమినల్‌ ఉద్దేశాలు ఉన్నాయా అని గుర్తించడంలో న్యాయస్థానాలు అత్యంత అప్రమత్తం గా వ్యవహరించాలి” అని లా కమిషన్‌ నివేదికలో వెల్లడించింది.  పోక్సో కేసుల్లో ఎక్కువ మంది నేరస్థులు పిల్లలకు తెలిసినవారు, సన్నిహి తులు, కొన్నిసార్లు ఆ కుటుంబానికి చెందిన వ్యక్తులేనని ప్యానెల్‌ స్పష్టం చేసింది.
సమ్మతి ఉందో లేదో నిర్ధారించేది దర్యాప్తు ఏజెన్సీలైతే, పోక్సో చట్టం కింద ప్రాసిక్యూట్‌ చేయాల్సి న చాలా నిజమైన కేసులు విచారణకు నోచుకోకపో వచ్చు. 
దర్యాప్తు సంస్థలే వాటిని ఏకాభిప్రాయంతో కూడిన లైంగిక సంబంధ కేసులుగా ప్రకటించడం వల్ల విచారణకు నోచుకోవని కమిషన్‌ పేర్కొంది. దీనివల్ల పోక్సో చట్టం కాగితపు చట్టంగానే మిగిలిపోతుందని తెలిపింది.  చట్టప్రకారం ప్రస్తుతం 18 ఏండ్లుగా ఉన్న శృంగార సమ్మతి వయసు 1860లో 10 ఏండ్లుగా ఉండగా, తర్వాతి క్రమంలో పెరుగుతూ వచ్చింది. 
 
అప్పట్లో 11 ఏండ్లకే వివాహిత అయిన ఒక బాలిక మరణం తీవ్ర నిరసనలకు దారితీసింది. ఆమె భర్త బలవంతంగా లైంగిక చర్యలకు పాల్పడటంతో తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయింది.  ఈ వ్యవహారంపై ప్రజాగ్రహం పెల్లుబికిన నేపథ్యంలో 1891లో సెక్షన్‌ 375 కింద శృంగార సమ్మతి వయసును 12 ఏండ్లకు పెంచారు. అనంతరం 1925లో 14 ఏండ్లకు, 1940లో 16 ఏండ్లకు మారింది. 2012లో పోక్సో చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత సమ్మతి వయసును 18 ఏండ్లకు పెంచినట్టు న్యాయ కమిషన్‌ నివేదికలో తెలిపింది.