‘వరల్డ్ టెర్రర్ కప్’గా మారుస్తానంటూ బెదిరింపులు

భారత్, కెనడా మధ్య దౌత్య వివాదం నెలకొన్నప్పటి నుంచ ఖలిస్తానీ ఉగ్రవాది, నిషేధిత సంస్థ ‘సిక్స్ ఫర్ జస్టిస్’ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నున్ పెట్రేగిపోతున్నాడు. అతడు వరుసగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇప్పటికే కెనడాలో ఉన్న హిందువులు భారత్‌కి వెళ్లిపోవాలని ఓ వీడియో ద్వారా హెచ్చరించాడు.
 
తాజాగా, అక్టోబర్ 5వ తేదీ నుంచి భారత్‌లో జరగబోయే క్రికెట్ వరల్డ్ కప్‌ని టార్గెట్ చేశాడు. ఈ క్రీడల్ని తాను ‘వరల్డ్ టెర్రర్ కప్’గా మారుస్తానని బెదిరించాడు.  దీంతో గుజరాత్ పోలీసులు అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఓ అధికారి తెలిపారు. ఒక విదేశీ నంబర్ నుంచి పంపిన ప్రీ-రికార్డ్ వాయిస్ మెసేజ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వ్యక్తులకు పన్నున్ బెదిరింపు వచ్చినట్లు ఆ ఎఫ్ఐఆర్‌లో అహ్మదాబాద్ పోలీసుల సైబర్ క్రైమ్ బ్రాంచ్ పేర్కొంది.
 
447418343648 అనే ఫోన్ నంబర్ నుంచి చాలా మందికి ప్రీ-రికార్డ్ చేసిన బెదిరింపు వాయిస్ మెసేజ్ వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని సైబర్ క్రైమ్ బ్రాంచ్ సబ్ ఇన్‌స్పెక్టర్ హెచ్‌ఎన్ ప్రజాపతి తెలిపారు. ఈ మెసేజ్ అందుకున్న చాలామంది వివిధ మాధ్యమాల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
ఇంతకీ ఆ ప్రీ-రికార్డ్ వాయిస్‌లో ఏముందంటే ‘‘అక్టోబర్ 5వ తేదీన క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభం కాదు, వరల్డ్ టెర్రర్ కప్ షురూ అవుతుంది. ‘సిక్స్ ఫర్ జస్టిస్’ ఖలిస్తానీ జెండాలతో అహ్మదాబాద్‌ను ముట్టడించబోతోంది. మేము నిజ్జర్ హత్యకు ప్రతీకారం తీర్చుకోబోతున్నాం” అంటూ పేర్కొన్నాడు. 

“మీ బుల్లెట్లకు వ్యతిరేకంగా బ్యాలెట్లను ఉపయోగించబోతున్నాం. మీ హింసకు వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నాం. గుర్తుంచుకోండి.. అక్టోబర్ 5న ప్రారంభమయ్యేది వరల్డ్ కప్‌కాదు, వరల్డ్ టెర్రర్ కప్. గురుపత్వంత్ సింగ్ పన్నూన్ నుండి వచ్చిన సందేశం ఇది’’. ఈ బెదిరింపు వ్యాఖ్యలను పోలీసులు తమ ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచారు.

అంతేకాదు గురుపత్వంత్ సింగ్ పన్నున్‌ని భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించిందని, అతడు విదేశీ దేశం నుంచి సిక్స్ ఫర్ జస్టిస్ అనే నిషేధిత సంస్థని నడుపుతున్నాడని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. భయాన్ని వ్యాప్తి చేయడానిక, దేశంలోని సిక్కులు, ఇతర వర్గాల మధ్య శత్రుత్వం సృష్టించడానికి, దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడడానికి పన్నన్ ప్రయత్నిస్తున్నాడని అందులో పోలీసులు రాశారు. 

ఇంతకుముందు కూడా అతను ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడ్డాడని ఎఫ్ఐఆర్‌లో తెలిపారు. కాగా, గురుపత్వంత్ ఇలా హెచ్చరికలు చేస్తున్నా కెనడా ప్రభుత్వంపై అతనిపై చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.