కార్ల సేఫ్టీ ఫీచ‌ర్ల‌ను త‌నిఖీ చేసే ‘భార‌త్ ఎన్‌క్యాప్’

కార్ల భద్రతా ప్రమాణాలను తనిఖీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టింది. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త విధానంలో   దేశవ్యాప్తంగా కార్ల భద్రతా ప్రమాణాలను తనిఖీ చేసేందుకు భారత్ ఎన్‌క్యాప్ (భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్) ప్రోగ్రామ్ అమ‌లు కానుంది. ఈ భార‌త్ ఎన్‌క్యాప్ దేశంలోని కార్లకు సేఫ్టీ రేటింగ్ ఇవ్వనుంది. 
 
ఈ సిస్టమ్‌ ద్వారా ప్రస్తుత కార్ల కంటే భవిష్యత్తులో రానున్న కార్లు మరిన్ని భద్రతా ప్రమాణాలతో వచ్చే అవకాశం కలదు. దీంతో ప్రపంచవ్యాప్తంగా కార్ క్రాష్ టెస్ట్ రేటింగ్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టిన ఐదవ దేశంగా భారత్ అవతరించింది.  భారత్  ఎన్‌క్యాప్ అమల్లోకి వస్తే కొత్త కారు కొనుగోలుదారులు తమ భద్రత గురించి మరింత అవగాహన కలిగి ఉండే అవకాశం ఉంటుంది. 
భద్రతకు సంబంధించి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని భారత్  ఎన్‌క్యాప్ నిబంధనలను రూపొందించారు.  గ్లోబల్  ఎన్‌క్యాప్ మాదిరిగానే వాహనాల్లో భద్రతా ప్రమాణాలను పరీక్షించి 1 నుంచి 5 స్టార్ రేటింగ్‌ను ఇస్తుందని కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా ప్రకటించింది. క్రాష్‌ టెస్ట్‌, సేఫ్టీ రేటింగ్‌లు ఎఐఎస్-197 కి లోబడి ఉంటాయి. ఆటోమేకర్లు తమ కార్ల కోసం స్వచ్ఛందంగా భారత్  ఎన్‌క్యాప్ పరీక్ష చేయించుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. 

దేశీయ, విదేశీ తయారీ పెట్రోల్, డీజిల్, సి ఎన్ జి, ఎలక్ట్రిక్ వాహనాలు, డ్రైవర్ సీటుతో సహా 8 సీట్లు, 3.5 టన్నుల కంటే తక్కువ బరువున్న కార్లు భారత్  ఎన్‌క్యాప్ పరీక్ష చేయించుకోవాలి. టాటా మోటార్స్, మారుతీ సుజుకి, టయోటా, స్కోడా, కియా, మహీంద్రాతో సహా కంపెనీలు భారత్  ఎన్‌క్యాప్ ని స్వాగతించడం కొసమెరుపు.