చంద్రుడిపై భారత రాయబారులుగా విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్‌-3 మిషన్‌ విజయవంతమై చరిత్ర సృష్టించింది. చంద్రుడిపై కాలుమోపిన విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ తమకు అప్పగించిన పని పూర్తిచేసి విస్తృతమైన శాస్త్ర పరిశోధనలకు ఆలంబనగా నిలిచాయి. 14 రోజులపాటు (చంద్రుడిపై ఒక పగలు) పరిశోధనలు చేసిన ఈ రెండూ ఆ తర్వాత రాత్రి కావడంతో నిద్రావస్థలోకి వెళ్లిపోయాయి. 
 
మళ్లీ అక్కడ లూనార్‌ డే పూర్తయ్యాక వాటిని నిద్ర లేపి ప్రయోగాలకు పురమాయించాలన్న ఇస్రో ప్రయత్నాలు ఇప్పటి వరకు ఫలించలేదు. శాస్త్రవేత్తలు మాత్రం తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. వారి ప్రయత్నాలు ఫలించినా, ఫలించకపోయినా చంద్రుడిపైకి చేరిన విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ భారత దేశపు తొలి రాయబారులుగా అక్కడే మిగిలే అవకాశం ఉంది. 

విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌ రెండూ శాస్త్రవేత్తల నియంత్రణలోకి రాకుంటే చాలా మార్పులు సంభవిస్తాయి. పగలు విపరీతమైన వేడి, రాత్రి మైనస్‌లలోకి పడిపోయే ఉష్ణోగ్రతల కారణంగా వాటి నిర్మాణం దెబ్బతింటుంది. వాటిలోని పదార్థాలు వేడికి వ్యాకోచించి, చల్లదనానికి కుంచించుకుపోతాయి.  చంద్రుడి ఉపరితలంపై ఉండే రెగోలిత్‌గా పిలిచే దుమ్ము రోవర్‌, ల్యాండర్‌లోకి చేరుతుంది. చంద్రుడి ఉపరితలం నిరంతరం సూక్ష్మ ఉల్కాకణాల పేలుళ్లకు గురవుతుంది.

ఈ కణాలు రోవర్‌, ల్యాండర్‌ ఉపరితలాలను దెబ్బతీసే అవకాశం ఉంది. సూర్యుడి రేడియేషన్‌కు, కాస్మిక్‌ కిరణాలకు గురవుతుంది.  ఎక్కువకాలం గురవడం వల్ల విక్రమ్‌, ప్రజ్ఞాన్‌లోని ఎలక్ట్రానిక్‌ పరికరాలు దెబ్బతింటాయి. సోలార్‌ ప్యానెల్స్‌ ద్వారా సూర్యరశ్మిని గ్రహించి విక్రమ్‌, ల్యాండర్‌ పనిచేస్తాయి. వీటిపై దుమ్ముధూళి పేరుకుపోతే సూర్యుడి కాంతిని అవి గ్రహించలేవు. అప్పుడు బ్యాటరీలు ఎందుకూ కొరగకుండా పోతాయి. 

అదే జరిగితే మిగతా వ్యవస్థలు సక్రమంగా ఉన్నా వృథానే. ఇక, చివరిగా శాస్త్రవేత్తల ప్రయత్నాలన్నీ విఫలమై అవి ఇక భూమితో శాశ్వతంగా సంబంధాలు కోల్పోతే చంద్రుడిపై శాశ్వతంగా భారత రాయబారులుగా మిగిలిపోతాయని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.