ఇతర దేశాల పాఠాలు భారత్‌కు అవసరం లేదు

వాక్ స్వాతంత్ర్యం గురించి భారత్ ఇతర దేశాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారత్, కెనడా మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో  ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న జైశంకర్ ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యానించారు. 

తీవ్రవాదం, హింస పట్ల కెనడా మెతక వైఖరి సమస్యగా మారిందని ధ్వజమెత్తారు. “చూడండి. మాది ప్రజాస్వామ్య దేశం. వాక్ స్వాతంత్ర్యం అంటే ఏమిటో మేము ఇతరుల నుంచి నేర్చుకోవలసిన అవసరం లేదు. వాక్ స్వాతంత్ర్యం హింసను ప్రేరేపించడం వరకు విస్తరించిందని మేము అనుకోము” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

“అది మన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తుంది, కానీ స్వేచ్ఛ రక్షణను కాదు. వాక్ స్వాతంత్ర్యం హింసకు దారి తీయకూడదని మేము స్పష్టంగా చెబుతున్నాం” అని జైశంకర్ పేర్కొన్నారు. భారత్‌, కెనడా దేశాలు పరస్పరం మాట్లాడుకోవాలని చెబుతూ నిజ్జర్‌ మృతిపై ఉన్న విభేదాలను ఎలా పరిష్కరించుకోవాలో చూడాలని హితవు చెప్పారు. 

భారత్, కెనడాల మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన వివాదంపై అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్‌లతో చర్చించినట్లు ఆయన తెలిపారు. అలాగే కెనడాలో అతివాదులు ఆశ్రయం పొందుతుండడం ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని అమెరికా దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిపారు.

‘‘ఈ విషయాన్ని నేను అమెరికన్లు, కెనేడియన్ల వద్ద కూడా స్పష్టంగా పేర్కొన్నాను. మాది ప్రజాస్వామిక దేశం. భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటో మేము ఇతర దేశాల నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. భావ ప్రకటనా స్వేచ్ఛ హింసకు దారి తీయకూడదని మేము స్పష్టంగా చెబుతున్నాం’’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలకు కచ్చితమైన ఆధారాలుంటే చూపిలాంచాలని జైశంకర్ కోరారు. ఉగ్రవాదంపై కెనడా ఉదాసీన వైఖరే ఇక్కడ ప్రధాన సమస్య అన్న ఆయన దానిని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.   అమెరికాకు కెనడా భిన్నమైన దేశంగా కనిపించొచ్చని అంటూ అగ్రరాజ్యంపై అసహనం వ్యక్తం చేశారు. 

కానీ తమ వరకు చూస్తే వ్యవస్థీకృత నేర సామ్రాజ్యం, ఏర్పాటువాదం, ఉగ్రవాదం, మానవ అక్రమ రవాణా కలగలిసిన ఓ విషపూరిత మిశ్రమానికి కెనడా కేంద్రంగా మారిందని జైశంకర్ మండిపడ్డారు. కెనడాలో నెలకొన్న పరిస్థితుల కారణంగా భారత దౌత్యవేత్తలు ఎంబసీకి వెళ్లేందుకు వెనకాడుతున్నారని ఆయన తెలిపారు. భారత దౌత్యవేత్తలు బహిరంగంగా బెదిరింపులకు గురవుతుండడంతో కెనడా పౌరులకు వీసాలు నిలిపివేయాల్సి వచ్చిందని మంత్రి జైశంకర్ తెలిపారు.