ఇన్నోవేషన్‌లో భారత్‌కు 40వ స్థానం

గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ 2023 ర్యాంకింగ్స్‌ జాబితాలో భారత్‌ 40వ స్థానంలో నిలిచింది. ప్రపంచ మేథో సంపత్తి సంస్థ (డబ్ల్యుఐపీఓ) గురువారం నాడు ఈ జాబితాను విడుదల చేసింది. ఇన్నోవేషన్‌ జాబితాలో స్వట్జర్లాండ్‌ మొదటి స్థానంలో నిలిచింది. దీని తరువాత రెండో స్థానంలో స్వీడన్‌, మూడో స్థానంలో అమెరికా ఉన్నాయి. 
 
మన దేశం గత సంవత్సరం కూడా ఈ జాబితాలో 40వ స్థానంలో ఉంది. 2013లో 66వ స్థానంలో ఉన్న భారత్‌ పదేళ్ల సమయంలో 26 స్థానాలు మెరుగుపరుచుకుంది.  రాజకీయ వాతావరణం, విద్య, మౌలిక సదుపాయలు, పరిశోధనలు, మానవ మూలధనం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఏటా ఈ ర్యాంక్‌లు కేటాయిస్తారు. 

భారత్‌ తాజా ర్యాంకింగ్‌పై నీతి ఆయోగ్‌ స్పందిస్తూ స్టార్టప్‌ సంస్థలకు అనువైన వాతావరణం, అపారమైన విజ్ఞాన సంపద అందుబాటులో ఉండటం, ప్రభుత్వ ప్రైవేట్‌ సంస్థల పరిశోధనలు మెరుగైన ర్యాంకింగ్‌కు దోహదపడినట్లు పేర్కొంది. విద్యుత్‌ వాహనాలు, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, అంతరిక్షం, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు మొదలైన వివిధ రంగాల్లో ఆవిష్కరణల కోసం చేస్తున్న ప్రయత్నాలకు నీతి ఆయోగ్‌ సమన్వయపరుస్తోందని తెలిపింది.

మిడిల్‌ ఇన్‌కమ్‌ దేశాల్లో టాప్‌ 40లో భారత్‌తో పాటు 12వ స్థానంలో చైనా, 36వ స్థానంలో మలేషియా, 38వ స్థానంలో బల్గేరియా, 39వ స్థానంలో తుర్కియే ఉన్నాయని డబ్ల్యూఐపీఓ తెలిపింది. దిగువ మధ్యాదాయ ఆర్ధిక వ్యవస్థల్లో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. ఈ విభాగంలో మన దేశం తరువాత వియత్నాం, ఉక్రెయిన్‌ ఉన్నాయి. 

వరసగా 13వ సంవత్సరం ఇన్నోవేషన్‌ ఓవర్‌పర్ఫార్మర్లుగా భారత్‌, రిపబ్లిక్‌ ఆఫ్‌ మల్ధోవా, వియత్నాం నిలిచినట్లు నివేదిక తెలిపింది. ప్రపంచంలోని యూనికార్న్‌ సంస్థల్లో 80 శాతం ఈ ఐదు దేశాల్లోనే ఉన్నట్లు తెలిపింది. యూనికార్న్‌లు ఎక్కువగా ఉన్న దేశాల్లో అమెరికాలో 54 శాతం, చైనాలో 14 శాతం, భారత్‌లో 6 శాతం, బ్రిటన్‌లో 4 శాతం, జర్మనీలో 2 శాతం ఉన్నాయని తెలిపింది. 

ప్రపంచంలోని మొత్తం యూనికార్న్‌ల విలువ 3.8 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్నాయని, ఇందులో ఒక్క అమెరికాలో ఉన్న వాటి విలువే 2 లక్షల కోట్ల డాలర్లుగా ఉన్నట్లు తెలిపింది. చైనాలో ఉన్న వాటి విలువ 736 బిలియన్‌ డాలర్లు, భారత్‌లో ఉన్న వాటి విలువ 193 బిలియన్‌ డాలర్ల విలువ చేసే యూనికార్న్‌ సంస్థలు ఉన్నట్లు తెలిపింది.