కేజ్రీవాల్ నూతన గృహ నిర్మాణంపై సిబిఐ దర్యాప్తు

కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ బుధవారం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నూతన గృహ నిర్మాణంపై దృష్టి సారించింది. స్థానిక సిటీ సివిల్ లైన్స్‌లో ఉన్న సిఎం నివాసం నిర్మాణంలో పలు అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. టెండర్ రూల్స్‌తో పాటు పలు ఇతరత్రా నిబంధనలను బేఖాతరు చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. 

దీనిపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు సిబిఐ రంగంలోకి దిగింది. సంబంధిత వ్యవహారంలో ‘ గుర్తు తెలియని ప్రభుత్వ ఉద్యోగుల’పై విచారణ చేపట్టారు. అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక సాక్షాధారాలు వెల్లడైతే అధికారులపై పోలీసు కేసులు దాఖలు చేసేందుకు రంగం సిద్ధం అవుతుంది.

సిఎం ఇంటి నిర్మాణ పత్రాల నమోదిత కాగితాలను తమకు అందించాలని సిబిఐ ఢిల్లీ ప్రభుత్వ పిడబ్లుడికి లేఖ పంపించింది. ఇంటి నిర్మాణానికి పిడబ్లుడి అధికారుల సిఫార్సులు, ఆమోద పత్రాలు, ముఖ్యమంత్రి నివాసానికి జరిగిన మార్పులు చేర్పులు , నిర్మాణ సంస్థలకు బిడ్స్ సమర్పణలు వంటి కాగితాలను తమ స్వాధీనం చేయాలని సిబిఐ డిమాండ్ ఆదేశాలలో తెలిపారు.

 తమకు అన్ని పత్రాలు అక్టోబర్ 3వ తేదీలోగా ఇవ్వాలని తెలిపారు. కేజ్రీవాల్ కొత్త ఇల్లు నిర్మాణానికి అయిన వ్యయం మొత్తం మీద రూ 52 కోట్లు అని విజిలెన్స్ కమిషన్ అప్పట్లో కేంద్రానికి నివేదిక ఇచ్చింది. ఇందులో కేవలం ఇంటి నిర్మాణానికి రూ 33.49 కోట్లు వ్యయం కాగా, సిఎం క్యాంప్ కార్యాలయానికి అయిన ఖర్చు రూ19.22 కోట్లు అని ఇందులో వివరించారు. 

ఈ నివేదిక ముందు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు పంపించారు. దీనిని ఆధారంగా లెఫ్టినెంట్ గవర్నర్ మే నెలలో సిబిఐ డైరెక్టర్‌కు లేఖ రాశారు. గృహ నిర్మాణంపై వచ్చిన ఆరోపణలోని అన్ని కోణాలపై ఢిల్లీ చీఫ్ సెక్రెటరీ స్థాయిలో దర్యాప్తు జరిగింది. 

కాగా, తమ పార్టీ ఆప్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు బిజెపి శతవిధాలుగా యత్నిస్తోందని ఆమ్ ఆద్మీపార్టీ ఆరోపించింది. ఇప్పటికే కేజ్రీవాల్‌జీపై బిజెపి తరఫున 50 కేసులు దాఖలు అయ్యాయని పేర్కొంటూ వీటిలో ఏది నిలబడలేదని గుర్తు చేసింది. బిజెపి ఎంత దర్యాప్తు తంతు సాగించినా ఫలితం ఏదీ ఉండదని స్పష్టం చేసింది.