ఆసియా క్రీడల్లో తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సంచలనం

* అరంగేట్రంలోనే  షూటింగ్‌లో స్వర్ణం, రజతం

ఆసియా క్రీడల్లో తెలంగాణ ముద్దుబిడ్డ ఈషా సింగ్ సంచలనం సృష్టించింది. షూటింగ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించి జాతికి గర్వకారణంగా నిలిచింది. బుధవారం భారత్‌కు ఎనిమిది పతకాలు దక్కాయి. ఇందులో ఏడు పతకాలు షూటింగ్‌లోనే లభించాయి. రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, రెండు కాంస్య పతకాలు దక్కాయి. హాంగ్‌జౌ క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 22 పతకాలను సొంతం చేసుకుంది. ఇందులో ఐదు స్వర్ణాలు, ఏడు రజతాలు, పది కాంస్య పతకాలు ఉన్నాయి. కాగా, భారత్‌కు షూటింగ్‌లో అత్యధికంగా 12 పతకాలు లభించాయి. వీటిలో 3 స్వర్ణాలు, నాలుగు రజతాలు, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. 

కాగా, మహిళల 25 మీటర్ల టీమ్ విభాగంలో భారత్ పసిడి పతకాన్ని సాధించింది. మను బాకర్, ఈషా సింగ్, రిథమ్ సంగ్వాన్‌లతో కూడిన భారత బృందం ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణం సొంతం చేసుకుంది. మరోవైపు మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ వ్యక్తిగత విభాగంలో సిఫ్ట్ కౌర్ సమ్రా పసిడి పతకం దక్కించుకుంది. అసాధారణ ప్రతిభతో అలరించిన సిఫ్ట్ కౌర్ ప్రథమ స్థానంలో నిలిచి స్వర్ణం కైవసం చేసుకుంది.

తెలంగాణ యువ షూటర్‌ ఇషాసింగ్‌ స్వర్ణంతో మొదలైన పతక వేట ఆఖరి వరకు దిగ్విజయంగా కొనసాగింది. మనుభాకర్‌, రితమ్‌ సాంగ్వాన్‌తో కలిసి 25మీటర్ల పిస్టల్‌ టీమ్‌ఈవెంట్‌లో పసిడి కొల్లగొట్టిన ఇషా హోరాహోరీగా సాగిన వ్యక్తిగత ఈవెంట్‌లో వెండి వెలుగులు విరజిమ్మింది. అరంగేట్రం ఆసియాగేమ్స్‌లోనే తన సత్తాచాటుతూ డబుల్‌ ధమాకాతో అదరగొట్టింది.

ఒత్తిడిని అధిగమిస్తూ కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుంటూ పతకాలను ఒడిసి పట్టుకుంది. అసాధారణ ప్రతిభను కనబరిచిన భారత యువ సంచలనం ఈషా వ్యక్తిగత ఈవెంట్ లో తృటిలో స్వర్ణం సాధించే అవకాశాన్ని చేజార్చుకుంది.  బుధవారం తొలుత జరిగిన మహిళల 25మీటర్ల పిస్టల్‌ టీమ్‌ఈవెంట్‌లో ఇషాసింగ్‌, మనుభాకర్‌, రితి సాంగ్వాన్‌తో కూడిన భారత త్రయం 1759 స్కోరుతో అగ్రస్థానంతో పసిడి పతకాన్ని సగర్వంగా ముద్దాడింది. చైనా(1756), కొరియా(1742) వరుసగా రజత, కాంస్య పతకాలు ఖాతాలో వేసుకున్నాయి. 

అదే జోరు కొనసాగిస్తూ మహిళల 25మీటర్ల పిస్టల్‌ వ్యక్తిగత ఈవెంట్‌ తుదిపోరులో ఇషాసింగ్‌ 34 స్కోరుతో రెండో స్థానంలో నిలిచి రజతాన్ని సొంతం చేసుకుంది. లు రుయి(చైనా, 38), యాంగ్‌ జిన్‌(కొరియా, 29) స్వర్ణ, కాంస్యం సాధించారు. ఆఖరి రౌండ్‌ వరకు చైనా షూటర్‌తో 18 ఏండ్ల ఇషా నువ్వానేనా అన్నట్లు తలపడింది. చైనా షూటర్‌ ఐదింటిలో ఒకసారి లక్ష్యానికి దూరం కొట్టగా, ఇషాసింగ్‌ మూడు సార్లు చేజార్చుకుంది. దీంతో తృటిలో పసిడి కోల్పోవాల్సి వచ్చింది.

కాగా, మహిళల 25 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ టీమ్ విభాగంలో భారత్‌కు రజతం దక్కింది. ఆషి చౌష్కీ, మనిని కౌషిక్, సిఫ్ట్ కౌర్ సమ్రాలతో కూడిన భారత బృందం రెండో స్థానంలో నిలిచింది. కాగా, పురుషుల స్కీట్ షూటింగ్ వ్యక్తిగత విభాగంలో భారత షూటర్ అనంత్‌జీత్ సింగ్ రజతం దక్కించుకున్నాడు. అంతేగాక మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ వ్యక్తిగత విభాగంలో ఆషి చౌష్కీ కాంస్యం సాధించింది. పురుషుల స్కీట్ టీమ్ షూటింగ్ విభాగంలో కూడా భారత్‌కు కాంస్యం లభించింది. కాగా, సెయిలింగ్‌లో భారత ఆటగాడు విష్ణు శరవణన్ కాంస్యం గెలుచుకున్నాడు.

మరోవంక, ఆసియాగేమ్స్‌లో తెలంగాణ స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ అప్రతిహత విజయాలతో దూసుకెళుతున్నది. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయని నైజంతో పదునైన పంచ్‌లు సంధిస్తున్నది. బుధవారం జరిగిన మహిళల 50కిలోల ప్రిక్వార్టర్స్‌ బౌట్‌లో నిఖత్‌ జరీన్‌ 5-0తో చొరాంగ్‌ బాక్‌(కొరియా)పై అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఆది నుంచే తనదైన జోరు కనబరిచిన ఈ ఇందూరు బాక్సర్‌..కొరియా బాక్సర్‌ను ఆటాడుకున్నది. కచ్చితమైన పంచ్‌లు కొడుతూ కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుంది.