తెలంగాణాలో కూడా బిజెపి ఎంపీలంతా పోటీ!

మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు కేంద్రమంత్రులు సహా ఏడుగురు సీనియర్లను బీజేపీ బరిలోకి దించుతోంది. సోమవారం ఆ పార్టీ 39 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను విడుదల చేయగా వీరి పేర్లు ఉన్నాయి.  కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్‌, జలశక్తి మంత్రి ప్రహ్లాద్‌ పటేల్‌, గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తేతో పాటు బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాశ్‌ విజయవర్గీయ, ఎంపీలు ఉదయ్‌ ప్రతాప్‌ సింగ్‌, రితి పాఠక్‌, గణేశ్‌ సింగ్‌‌లకు ఎమ్మెల్యే టిక్కెట్లను కేటాయించింది.
 
అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్లను పోటీకి దింపాలని బీజేపీ తీసుకున్న నిర్ణయం కేవలం మధ్యప్రదేశ్‌కే పరిమితం కాదని, ఎన్నికలు జరగబోయే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ వంటి ఇతర రాష్ట్రాలలో దీనిని అనుసరించాలని ఆ పార్టీ యోచిస్తోందని చెబుతున్నారు.  గతంలో పార్టీ అభ్యర్థులు పోరాడిన లేదా అరుదుగా గెలిచిన స్థానాలలో విజయవకాశాలను పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాజస్థాన్ కేంద్ర జల్ శక్తి మంత్రి, జోధ్‌పూర్ ఎంపీ గజేంద్ర సింగ్ షెకావత్, పార్లమెంటరీ వ్యవహారాల సహా మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్, రాజ్‌సమంద్ ఎంపీ దియా కుమారి, జైపూర్ (గ్రామీణ) ఎంపీ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ వంటి ప్రముఖులకు అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించనుంది.

ఇక, తెలంగాణకు సంబంధించిన కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ  జి. కిషన్ రెడ్డి సహా నలుగురు లోక్ సభ సభ్యులతో పాటు, రాజ్యసభ సభ్యునిగా ఉన్న డా. కె లక్ష్మణ్ సహితం అసెంబ్లీ బరిలోకి దింపనున్నారని తెలుస్తోంది. వీరిలో కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ గత అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందగా, తదుపరి లోక్ సభకు ఎన్నికయ్యారు. 
 
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన డా. లక్ష్మణ్ తర్వాత రాజ్యసభకు ఎంపికయ్యారు. వీరంతా గతంలో పోటీ చేసిన నియోజకవర్గాలలో లేదా తమ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఓ నియోజకవర్గం నుండి అసెంబ్లీకి పోటీ చేయవచ్చని భావిస్తున్నారు.