రాజకీయ సౌలభ్యం కోసం ఉగ్రవాదంపై ఉదారంగా ఉండొద్దు

రాజకీయ సౌలభ్యం కోసం ఉగ్రవాదం, తీవ్రవాదం, హింస వంటి వాటికి వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలపై ఉదారంగా ఉండకూడదని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పరోక్షంగా కెనడా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  ఓవైపు కెనడాలో ఖలిస్థానీల చర్యలు, మరోవైపు సరిహద్దుల్లో చైనా కవ్వింపులు, ఉగ్రవాదానికి పాకిస్థాన్‌ ఇస్తున్న ప్రోత్సాహం మధ్య ఐక్యరాజ్య సమితి  సాధారణ సర్వసభ్య సమావేశంలో మంగళవారం ప్రసంగిస్తూ ఉగ్రవాదాన్ని ప్రధాన అంశంగా చేసుకున్నారు.
 
అంతర్జాతీయ నిబంధనలు, ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను గౌరవవించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని వివిధ దేశాలకు హితవు చెప్పారు. ‘భారత్‌’ పేరిట ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన అదే పేరుతో ముగించడం గమానార్హం.  కాగా, భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్య దేశం హోదాను అడ్డుకుంటున్న శక్తుల నుంచి ఉద్దేశించి కూడా జైశంకర్‌ ప్రస్తావిస్తూ సమితిపై కొన్ని దేశాలే పెత్తనం చేసే రోజులు పోయాయని స్పష్టం చేశారు. సంఘీభావంలో నిజాయతీ లేకుంటే నమ్మకం ఎప్పటికీ కుదరదని  తేల్చి చెప్పారు. 
 
ఆర్థికంగా వెనుకబడిన దేశాలకు తగిన ప్రాధాన్యం ఇచ్చేలా జి-20 కూటమిలో ఆఫ్రికన్‌ యూనియన్‌ను చేర్చుకున్న సంగతిని ప్రస్తావిస్తూ, భద్రతా మండలి సంస్కరణకు సమితికి ఇది ప్రేరణ కావాలని జైశంకర్‌ సూచించారు. కాగా, అలీనోద్యమ కాలం నుంచి భారత్‌ బయపడిందని, ఇప్పుడు విశ్వగురు (యావత్‌ ప్రపంచానికి గురువు)గా ఎదిగిందని చెప్పుకొచ్చారు.
 
ఈ సందర్భంగా అన్ని దేశాల ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని హితవు పలికారు.  ఒక దేశ ప్రాదేశికతను, సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను గౌరవించడం, అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం వంటి అంశాలను పొరుగు వారు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని కెనడాను ఉద్దేశించి చెప్పారు.

కొన్ని దేశాలు ప్రపంచ ఎజెండాను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాయని పేర్కొంటూ అయితే అలాంటి ప్రయత్నాలు ఎప్పుడూ కొనసాగవని హెచ్చరించారు. ఈ సందర్భంగా భారత్ నియమాలను పాటిస్తుందని స్పష్టం చేశారు.  అందరూ అనుకుంటే న్యాయమైన, సమానమైన, ప్రజాస్వామ్య క్రమం తప్పకుండా వస్తుందని జై శంకర్ హితవు పలికారు. భాగస్వామ్య దేశాలతో సహకారాన్ని పెంపొందించుకోవడానికి భారత్ నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందని ఆయన గుర్తు చేశారు. 
 
భారత్ అమృత కాలంలోకి ప్రవేశించిందని, దీనికి గుర్తుగా చంద్రయాన్ 3 మిషన్‌ను విజయవంతం చేశామని జైశంకర్  తెలిపారు. చంద్రుడిపై ల్యాండర్‌ను విజయవంతంగా ల్యాండ్ చేయించిన దేశంలో ఆవిర్భవించిందని పేర్కొన్నారు. భారత్‌లో మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని చెబుతూ శక్తిమంతమైన స్టార్టప్ దేశంగా అవతరిస్తోందని చెప్పారు.